విజయ్ కోగంటి, పద్మజ కలపాల అందిస్తున్న 'పడమటి రాగం' పశ్చిమ కవన, కథన రీతులను, వాటి తాత్విక, చారిత్రక నేపథ్యాలను ఒక చోట చేర్చడం ద్వారా ప్రపంచ సాహిత్యం గురించి సమగ్ర అవగాహనను అందిస్తోంది. పుస్తకం ఇంగ్లీషు సాహిత్యానికి మాత్రమే పరిమితం కాదు. మనిషి మదిలోని చీకటిని వెలిగించిన రష్యన్ నావలికుడు దోస్తయేవ్ స్కీ, ఇప్పటికీ తాజా అనిపించేలా దైనందిన జీవితాన్ని కళ్లకు కట్టిన మరో రష్యన్ కథకుడు ఆంటన్ చెసూవ్, మనిషికి పురుగుకి పెద్ద తేడా ఏముందని విషాదించిన చెక్ జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా, స్టాలినిస్టు నిరంకుశం మీద కవితాస్త్రాలు విసిరిన రష్యన్ కవయిత్రి అనా అమ్మితోవా, మన అభ్యుదయ/ విప్లవ కవనాల తొలి చాలు జర్మన్ నాటకకర్త/కవి బెర్తోల్ బ్రెస్ట్.... ఇంకా పలువురిని ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. కవిత్వం, కథ చదవడం లేదా రాయడం నేర్చుకునే వారికి ఈ పుస్తకం చక్కని కరదీపిక అవుతుంది. ఎప్పటికప్పుడు కమ్ముకునే చీకట్లలో ఇలాంటి కరదీపికలు అవసరం.
- హెచ్చార్కె
పడమటి' పేరంటేనే స్ఫురించేది పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాలు. ఆయా దేశాలలో ఆయా కాలాల్లోని ఆధిపత్య సంస్కృతిని, అధికార దురహంకారాలను నిరసిస్తూ, ఎదిరిస్తూ ప్రజల పక్షాన నిలిచి సాహిత్య సృజన గావించిన మహా రచయితల జీవన రాగాన్ని వినిపిస్తూ వారి ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చేస్తున్న మంచి పుస్తకం 'పడమటి రాగం'. భిన్న రీతులలో, విభిన్న ప్రక్రియలలో విశిష్ట సాహితీ వేత్తలుగా పేరొందిన ప్రపంచ ప్రసిద్ధ రచయితల సాహిత్య కృషిని మన ముందుంచుతున్న ఈ చిరు పొత్తం వారి సమగ్ర సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఒకానొక సాహిత్య ప్రయోజనాన్ని సాధిస్తోంది. ప్రపంచంలో గతకాలంలో విరాజిల్లిన సాహిత్యోద్యమాలు, నూతన ఆవిష్కరణలను తెలియజేసే చారిత్రక పత్రమీ పుస్తకం. అంతేగాక ఆయా దేశాల జీవన, సాంస్కృతిక సారాంశాన్ని రూపుకట్టి ప్రాపంచిక దృష్టిని ప్రసరిస్తున్న రచన ఇది. విలువైన సాంస్కృతిక వారసత్వ సంపదను మనముందుంచుతూ ప్రపంచీకరణ సందర్భంలో ఆదాన ప్రదానాల అవసరాన్నీ, ఆవశ్యకతను మరింతగా నినదిస్తున్నదీ గ్రంథం. రచయితలు విజయ్ కోగంటి, పద్మజ కలపాల అభినందనీయులు. అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.) పక్షాన శుభాకాంక్షలు. -
- పెనుగొండ లక్ష్మీనారాయణ అ.ర.సం.
జాతీయ కార్యదర్శి