సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ ప్రపంచంలోనే కాదు, చలనచిత్ర పరిశ్రమలో కూడా శ్రీ శ్రీని అభిమానించి, ప్రేమించి ఆదరించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనాలు. అందులో సినిమారంగంలో నటుడు నిర్మాత రెస్టార్ మాదాల రంగారావు, విశ్వశాంతి విశ్వేశ్వరరావు, పద్మాలయ సంస్థ హీరో సూపర్‌స్టార్ కృష్ణను మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈ విషయం మనం చెప్పుకోవడం కాదు,మహాకవి శ్రీశ్రీయే స్వయంగా ఎన్నో సార్లు చెప్పుకున్నారు కూడా.
'పదండి ముందుకు, కులగోత్రాలు వంటి చిత్రాలలో తొలుత వెండితెరపై కనిపించిన హీరోకృష్ణ చలనచిత్రసీమలో రంగప్రవేశం చేసింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం లోని బాబూ మూవీసా వారి 'తేనెమనసులు (1965) అయితే, నిర్మాతగా రంగప్రవేశం చేసింది స్వీయనిర్మాణ సంస్థ పద్మాలయావారి అగ్నిపరీక్ష (1970). నాటి నుండి మరణించే వరకు పద్మాలయాసంస్థ వారు చాలా చిత్రాలకు శ్రీశ్రీతో పాటలు రాయించుకున్నారు. ఎన్నో విధాల ఆదుకున్నారు. నచ్చి మెచ్చిన పాటకు అనుకున్నదాని కంటే అదనంగా ఇవ్వడం, ఇవ్వాల్సిన బాకీ లేకున్నా అవసరానికి అడ్వాన్సులు ఇవ్వడం. శ్రీశ్రీ సకల ప్రయాణాలకు అడ్వాన్స్ బుకింగ్ చేయించి టికెట్స్ ఏర్పాటు చేయడం శ్రీశ్రీపై వారికున్న ప్రేమకు, గౌరవానికి నిదర్శనం. అందుకే 'నేను ఒక అక్షరం రాసినా దానికి కూడా విలువకట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ! సినీ ఫీల్డ్ నా మీద ప్రత్యేకాభిమానం వున్న అనేకులలో ముఖ్యుడుగా నటశేఖర కృష్ణను ఆత్మీయుడిగా పరిగణిస్తాను' అంటారు శ్రీశ్రీ
ఈ అపూర్వకలయికలో అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం పుట్టిన గొప్ప సాయుధ పోరాట దేశభక్తి గీతం 'తెలుగువీర లేవరా!'.శ్రీశ్రీ రాసిన ఈ గీతం తొలి తెలుగు జాతీయ అవార్డు సాధించిన పాటగా నమోదయింది. సినిమాపాటకు జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు కవిగా శ్రీశ్రీ రికార్డయ్యారు. సంస్థ గౌరవ ప్రతిష్ఠలు మరింత పెంచినందుకు హీరో కృష్ణ పద్మాలయా సంస్థద్వారా శ్రీశ్రీకి మరోమారు పారితోషకాన్ని అందించి గౌరవించారు. .
ప్రస్తుతం పద్మాలయా సంస్థకు యాభై ఏళ్లు. తెలుగు చలనచిత్ర సీమలో సంచలన చిత్రాలూ, సంచలన విజయాలు సొంతం చేసుకుని అంతర్జాతీయ చలనచిత్రసీమలో తెలుగు జెండా ఎగరేసిన పద్మాలయా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.
శ్రీశ్రీ పుస్తకాలు, శ్రీశ్రీపై పుస్తకాలు ప్రచురణ ప్రచార ప్రణాళికలలో శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణలు 'రెండో నూరు పుస్తకాల హోరు' ప్రణాళికలో వెలువడుతున్న 108 వ పుస్తకం ఇది. శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలోకి కదలి రండి, కలిసిరండి, పది మందినీ కలుపుకురండి. మీ వంతూ గొంతూ అందించండి.
కన్వీనర్, శ్రీశ్రీ సాహిత్యనిధి