పద్యానికి ప్రణతులు
(మహాకవులు - వారి గ్రంథాలు)
ఉపోద్ఘాతము : పద్యము రాయగలరుగ
విద్యను ఛందస్సుతోడ పెనవేసినచో
గద్యము కంటెను సులభము
ఉద్యోగము లాగ భాషనురికించ తగన్
'అభ్యాసము కూసు విద్య' అన్నారు. జీవితంలో మనం అనుకోకుండా జరిగే ప్రేమ, ఉద్యోగం, పెళ్ళి, సంసారం వంటి వాటిని ఇష్టమున్నా లేకున్నా ఎలా సాధన చేసి విజయం సాధించి ఆనందిస్తామో, ఈ పద్య రచన కూడా అటువంటిదే. ఈ పద్యాల పూదోటలో ఒకసారి అడుగు పెడితే ఆ వైవిధ్యమైన అందాలకు మైమరచి, ఆ పద్యసుమ సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ అలాగే ఉండిపోతాము. విడిచి రాలేము. ఈ పుస్తకం పద్యంపై ఇష్టాన్ని కలిగించి, పెంచి పద్యరచనకు ప్రేరణనివ్వాలని, ఇస్తుందని ఆశిస్తాను. ఇందులో తెలుగు భాషా విద్యార్థులకు 'Bits' కూడా లభిస్తాయి.
పాఠశాల విద్య నుంచే పద్యాలు, ఛందస్సు అంటే ఏదో బెరుకు, భయం, గ్రాంథికం కూడా ఈ భయమూ నిరాసక్తతలకు కొంత కారణం. మొల్ల, గురజాడ, భావకవులు తేలికపాటి పదాలనే ఉపయోగించి పద్యాలను రాశారు. ఆయా లక్షణాలను జాగ్రత్తగా గమనించి, పాటిస్తే నాబోటి సామాన్యులు సైతం పద్యాలు రాయగలరు.
పద్య రచయితలు, వారి 'ప్రసిద్ధ గ్రంథాల' పేర్లు మరియు పద్యాలలో రకాలను గురించి నాకు తెలిసిన అతి కొద్ది విషయాలను పాఠకలోకంతో పంచుకోవాలని ఈ చిన్న ప్రయత్నం. అంతేకాకుండా ఇందులో నాకు కనీస సమాచారం లభ్యమైన (పద్య) రచయితలను మాత్రమే పేర్కొన్నాను. కొందరు ప్రముఖులను గాని, కొన్ని ప్రముఖ గ్రంథాలను కానీ ప్రస్తావించి యుండకపోయినా, పునరుక్తులు దొర్లినా, అది నా...........