ప్రవేశిక
విశాల భారతదేశంలో వివిధ ప్రాంతాల భావసమైక్యాన్ని, భాషా సారస్వతాల పరస్పరావగాహనను రూపొందించటానికి, పెంపొందించటానికి సాహిత్య అకాడమి పుట్టింది.
జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, సునీల్ కుమార్ చటర్జీ లాంటి మహనీయులు సాహిత్య అకాడమి లక్ష్యాలను, ఆదర్శాలను తొలి దశాబ్దాలలో మార్గదర్శనం చేశారు. నేటికి 60 సంవత్సరాలైంది సాహిత్య అకాడమి స్థాపనమై. ఇప్పటికి భారతీయ భాషలలో కొన్ని వేల పుస్తకాలు ప్రచురించింది. ఒక భాషా సారస్వతం నుంచి వేరొక భాషా సారస్వతం లోకి కొన్ని వందల పుస్తకాలు అనువాదం చేయించింది.
ఇటీవలనైతే రోజుకో పుస్తకం ప్రచురిస్తున్నట్లు సాహిత్య అకాడమి ప్రచురణ గణాంక వివరాలు చెపుతున్నాయి. కేవలం పుస్తక ప్రచురణమే కాక ఆసేతుశీతాచలం సాహిత్య సదస్సులు, ఆయా భాషల మహాకవుల జయంతులు, పది కాలాలపాటు భారతీయులు ఎవరి స్మృతినైతే పదిల పరచుకోవాలో, వారి సాహితీ జీవన సంక్షిప్త చరిత్రలు ప్రకటించటమే కాక, ఈ పుస్తకాలను ఇతర భాషలలోకి అనువదింపచేసే కార్యక్రమం కూడా సాహిత్య అకాడమీ కొనసాగిస్తున్నది.
ప్రతి భారతీయ భాషకు కొన్ని శతాబ్దాల సాహిత్య చరిత్ర ఉన్నది. కాని ఈ భాషలలో సృజనాత్మక మహాప్రతిభులైన గొప్పకవులు, పండితులు, నాటక కర్తలు, మార్గ దర్శకులు ఎవరు? అని ఇతర ప్రాంతాలవారు తెలుసుకోగల గొప్ప కార్యక్రియ దక్షతే కర్తవ్యంగా నిర్వహించే సంస్థాగత కృషికోసమే సాహిత్య అకాడమి ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం ఆయా భాషలలో వచ్చిన గ్రంథాలకు పురస్కారాలందించి రచయితలకు గుర్తింపు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. ఆయా...................