పల్లె సింధూరం
చుట్టూ పచ్చని చీరను పరచినట్లు కనిపించే పచ్చని పొలాలు, నడుమ రామాపురం. శివపురం అనే గ్రామాన్ని ఆనుకుని వుంటుంది. గ్రామంలోని ప్రధాన వీధిలో నున్న ఓ చిన్న రామాలయం ప్రక్కనే విశ్వం మాస్టారి గారి ఇల్లు. ఇంటిముందు గుమ్మం, ఇరువైపులా రెండు చలువరాతి అరుగులు. ఎడమవైపు ఓ పెద్ద వేపచెట్టు. పెరట్లో ఓ గిలకబావి. మరియు ఓ బాదం చెట్టు. ఇంటి చుట్టూ మట్టితో కట్టిన ఓ ప్రహరీ గోడ. గోడ చుట్టూ రకరకాల పూలచెట్లు, ఆకుకూరలు మరియు కూరగాయలు చెట్లు. అంతేగాక గోడలపై అల్లుకున్న చిక్కుడు, మరియు గుమ్మడి తీగెలు. చూపరులకు ఆ ఇల్లు ఒక 'పూలవనం'గా కనిపిస్తున్నది అంటే అతిశయోక్తి కాదు.
ఆధునికతకు నిలువెత్తు సాక్ష్యంలా వున్న నేటి కంప్యూటర్ యుగంలో కూడా పాత సినిమా హీరోలా కన్పిస్తారు విశ్వనాథం మాస్టారు.
ఆయన ఆహార్యం : తెల్లని పంచె, తెల్లని చొక్కా మరియు భుజం మీద ఓ కండువ, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. అంతేగాక ఓ నల్లని గొడుగు కూడా ఆయన శరీరంలో ఓ భాగమై పోయిందంటే ఆశ్చర్యమేమీ కాదు.
గ్రామంలోని కొద్దిమంది విద్యావంతులలో ఆయన పేరు ముందువున్నా, మధ్యతరగతి మహాభారత యుద్ధంలో ఆయన ధర్మరాజు, ఎందుకంటే నిత్యం ఆకాశాన్నంటుతున్న ధరల జూదంలో ఆయన ఎప్పుడూ ఓటమి చవిచూస్తూనే వుంటాడు. కారణం ఆయన ముగ్గురు పిల్లలకు ముచ్చటైన తండ్రి. 'ఇద్దరు లేక ముగ్గురు చాలు' అనే నాటి ప్రభుత్వ ప్రకటనను పాటించి ముగ్గురు పిల్లలతో సంతృప్తి చెందుతూనే జీవితంలో అనేక ఆటు పోట్లను తట్టుకొనే స్వభావం గల వ్యక్తి. తన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని పాఠాలనే గాక అనేక జీవిత పాఠాలు బోధించడం ఆయనకు 'వెన్నతో పెట్టిన విద్య'................