కవిత్వానికి అదనంగా అనువాదాలు చేయడం, వ్యాసాలు రాయడం నా రచనా వ్యాసంగంలో ఎప్పుడో ప్రధాన భాగాలై కూర్చున్నాయి. భాష పట్ల ప్రత్యేక అభిమానం మొదట్నుంచీ ఉంది. నా మొదటి కవితా సంపుటిలో కొన్ని ఛందోబద్ద పద్యాలున్నాయి. తర్వాత ఛందోబద్ద పద్యాల సంపుటిని కూడా వెలువరించాను. దాని పేరు అంతస్తాపము. తర్వాత్తర్వాత భాషకు సంబంధించిన కొత్త విషయాలను చర్చిస్తూ రాయడం అలవాటైంది. అదింకా కొనసాగుతూనే ఉన్నది. ఆంగ్లంలో క్లాసిక్స్ అనతగిన కొన్ని మంచి పుస్తకాలను చదవటంతో ఆ భాష కూడా చాలా వరకు పట్టుబడింది. దాన్ని మరింత పెంపొందించుకున్నాను. స్వయంకృషితో రెండు భాషల మీద చాలా వరకు పట్టు సాధించిన తర్వాత అనువాదాలకు పూనుకుని, వాటిని కొనసాగిస్తూనే ఉన్నాను. ఇక శాస్త్రీయ సంగీతం పట్ల అభిరుచి మొదట్నుంచీ అంకుర దశలో ఉన్నప్పటికీ సామల సదాశివ గారి సాంగత్యం వలన అది మరింత జాగృతమై, మహావృక్షపు రూపం దాల్చింది. ఈ మూడు సబ్జెక్టుల మీద రాసిన వ్యాసాల సంపుటియే ఈ పుస్తకం.