1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామంలో పుట్టిన ఎలనాగ ప్రధానంగా అనువాదకుడు, కవి, విమర్శకుడు. చిన్నపిల్లల వైద్యుడైన ఈయన ఇప్పటి వరకు 30 పుస్తకాలు రాశారు. వీటిలో 15 స్వతంత్ర రచనలు కాగా, 15 అనువాదాలు. అనువాద రచనలలో 8 ఆంగ్లంనుండి తెలుగులోకి, 7 తెలుగునుండి ఆంగ్లంలోకి తర్జుమాలు. లెక్కలేనన్ని ఆంగ్లకవితలను తెలుగులోకి అనువదించడమే కాకుండా, ఈయన లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు, ప్రపంచ కథలు, పవన్ కె. వర్మ రాసిన Ghalib: The Man, The Times మొదలైన వాటిని భాషాంతరీకరించారు. ఎన్నో తెలుగు కవితలను, కథలను, వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన 'జైలు లోపల'ను, దాశరథి కృష్ణమాచార్య కథలను, కాళోజీ కథలను, ఆంగ్లంలోకి అనువదించారు. స్వతంత్ర రచనలలో వచన కవితలు, పద్య కవితలు, ప్రయోగ పద్యాలు, ప్రయోగ వచనం, సాహిత్య వ్యాసాలు, భాషాసంబధమైన పుస్తకాలు, శాస్త్రీయ సంగీతం మీద ఆంగ్ల కవితల పుస్తకం, ప్రామాణిక గళ్ల నుడికట్లు మొదలైనవి ఉన్నాయి.