ఏలూరు నరసింహారావు పేటలో - అది 1994 సం|| అనుకొంటాను. నా ఆరాధ్య ప్రియతముడైన శిరిడీ సాయిబాబా మందిరంలో ఆయనను తదేక దృష్టితో చూస్తూ ఉండగా,నా వెనుక కూర్చొన్న భక్తులు వారి సంభాషణలో శ్రీ అరవిందాశ్రమం వెళ్ళి వచ్చామండీ, మేము వెళుతూ వుంటాము అని ఎవరితోనో అన్నమాటలు చెవిన పడ్డాయి. మళ్ళీ నా మనసు మూర్తి వైపుకు మళ్ళింది. అంతకు మునుపే అక్కడే పరిచయ మయ్యారు. నేను జ్ఞాన మాతగా, వాత్సల్యమయిగా భావించుకొనే శ్రీమతి ఎస్ కమలగారు. ఒక సారి నన్ను అమ్మగారు వారింటికి తీసుకెళ్ళారు. సరిగ్గా వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంటివైపు చూశాను. నాదృక్కులు నేరుగా ఆ ఇంటిలోపల గోడకు తగిలించివున్న పెద్ద ఫొటో పైన పడ్డాయి. అంతే వెంటనే అమ్మగారిని ఆ ఫొటో లో వున్నదెవరమ్మా! అని అడిగాను. ఆమె చెప్పారు అదా....... “ఆయన అరవిందమహర్షి మహాయోగి అనిచెబుతూ గమ్మడిపూవు పోలిక చెప్పారు. ఎప్పుడైనా పూవు పూచి కాయ కాస్తుంది. కానీ గుమ్మడి కాయ కాచి పూవు పూస్తుంది. అలాగే అరవిందమహర్షికి ముందు శ్రీకృష్ణ సాక్షాత్కార మయ్యి తరువాత సాధన చేశారు” అని. విన్నాను కానీ మరింకా ప్రస్తావన మా మధ్య రాలేదు. 1996 లో బి.కామ్ చదువుతున్నప్పుడు కవిత్వం, చిత్రలేఖన పోటీలకి పేరు ఇవ్వడానికి జియాలజి లెక్చరర్ శ్రీ పి.సి.స్వరూప్ గారిని కలిశాను. డివైన్ లింక్ కలిసింది.