కిల్లీ దుకాణం
మద్రాసు మహానగరంలో ప్రసిద్ధుడయి వచ్చిన నారాయణకి ఆ చిన్న పట్నం ఒక ఎడారిలాగ కనిపించడంలో వింత లేదు. ఇక్కడ ట్రాములు, బస్సులు, మేడలూ, మిద్దెలూ లేకపోవటమే కాదు. అథమం ఒక సినిమా థియేటరయినా లేదు. తక్కినవి ఎన్ని లేకపోయినా భరించగలడు గాని, సినిమాలు లేకపోతే సగం జీవితమే పోయినట్టు భావిస్తాడు నారాయణ. అందుకు తగిన కారణం కూడా వుంది. అతని కాలేజీ చదువు సినిమాల సరదాల వల్లనే ఆగిపోయింది. కాని, అందుకు బదులుగా అతనెంతో విజ్ఞానం ఆర్జించగలిగాడు. తన విజ్ఞానాన్ని వెదజల్లే ఉద్దేశంతో ఒక సినిమా మాస పత్రిక కూడా నడిపాడు కొంతకాలం. పత్రిక ఆరంభ దశలోని వడుదుడుకులను అధిగమించి కాస్త నిబ్బరంగా నడుస్తున్న సమయంలో అతనికి స్వయంగా ఫిలిము తీయాలని కోరిక కూడా కలిగింది. ద్రౌపతిని కూడా ఒడ్డుతున్నాను, అని ధర్మరాజు అన్నట్లుగా యావదాస్తినీ పట్టుకొని దిగబడ్డాడు. ఒక ఎనిమిది నెలలపాటు ఎటు వెళ్తున్నాడో అతనికి ఆనూ, పానూ దొరక లేదు. ఎంత సేపూ ఎగ్రిమెంట్లు, ఎడ్వర్టయిజుమెంట్లు, జీతాలు, భత్యాలు -
అంత త్వరలో కంపెనీ దివాలా తీస్తుందని అతను స్వప్నేపి అనుకోలేదు. కంపెనీ దివాలా మాట దేవుడెరుగునుగాని, అందుమూలంగా తన పత్రిక కూడా పడుకుంది. అంతేకాదు అంతటి మహాపట్నంలో తనవంటి ప్రతిభాశాలికి ఉద్యోగం దొరక్కపోవడమేమిటి? అయితే అదీ ఒక రకంగా అదృష్టమే. లేకపోతే..............