నా తొలి రచన
నీళ్లబిందె చంకనెట్టుకొని, చీర అంచులు కాళ్ళకు తగలకుండా ఎత్తి పట్టుకొని లోపలి కొచ్చింది జానకి. బిందె బరువుతో ఆమె నడుస్తోంటే, చిరుగాలికి మెల్ల మెల్లన అల్లల్లాడే చిగురుటాకుల్లా కదులుతోన్న ఆమె అందాలను వాలుకళ్ళతో తనివి తీరా చూస్తున్నాడు - వాలు కుర్చీలో వాలిన సత్యమూర్తి.
కోపం వీడని సత్యభామలా ఉంది ఆమె.
ఎందుకలా అయిపోయింది జానకి? ఆ చురుకు దనం, చిలిపితనం ఏమై పోయాయి? తనతో సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. ఎప్పుడూ ముభావంగా ఉంటుంది. తనే పలుకరిస్తే, ముక్తసరిగా జవాబు లిస్తుంది. అంతే. నెల రోజులుగా సత్యమూర్తికి శాంతి కరువైపోయింది. ఆమె తనపై మోపిన అభాండాన్ని మోస్తూ ఇంకెన్నాళ్ళిలా?
కాఫీ కలిపి తెచ్చి, ముందున్న స్టూలుమీద పెట్టి వెళ్ళిపోయింది జానకి. కాఫీ కన్నా వేడిగా నిట్టూర్చి కప్పు అందుకొని, పొగలు గక్కుతోన్న కాఫీని మెల్లమెల్లగా చప్పరించి తాగేశాడు.
తిన్నగా లేచి వచ్చి గడప దగ్గర నుంచున్నాడు..........