జీవితం
అది క్రీస్తుశకం 19వ శతాబ్దం. స్థలం మదరాసు (చెన్నై) నగరం. అక్కడ పరమాద్భుత విజయాలు సాధించిన ఒక వ్యక్తి నివసించేవాడు. పదహారు సంవత్సరాలు వయసు నిండే దాకా అతడికి అక్షరజ్ఞానం లేదు. కానీ ముప్పైయేళ్ళ వయసులోనే విద్వాంసుడనే గుర్తింపు సాధించాడు. ఆయన జీవించింది అర్ధ శతాబ్దం కన్నా కొన్ని సంవత్సరాలు మాత్రం. అందులో మూడోవంతు కాలం పైగా పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు బోధించటంలో గడిచి పోయింది. చిన్నా చితకా రచనలు గాక, రెండు మహారచనలు ప్రచురించాడు. అయితేనేం? తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక శతాబ్దం కన్నా ఎక్కువ కాలం నిరాఘాటంగా పరిపాలించాడు. ఈ లెక్క కూడా తగ్గించి చెప్పిందే. అతడు తనకు ముందున్న సంప్రదాయాన్ని ధిక్కరించాడు. అయినా కాలగతిని వెనక్కు నడిపించి. తనదైన మరో సంప్రదాయాన్ని నెలకొల్పగలిగాడు. భాషా సాహిత్యాలను నిరంకుశంగా పాలించి ప్రతిస్పర్ధులనుంచి తీవ్ర విమర్శలకూ, మరణానంతరం కూడా ఘోర నిందలకూ గురయినాడు. అదే సమయంలో ఆయన విజయాలను కీర్తించి ఆయనను దైవంగా భావించి పూజించే సాహితీపరులను కూడా సంపాదించగలిగాడు. ఆయన పేరు పరవస్తు చిన్నయ. ఆయన పేరు చివరి 'సూరి' శబ్దం కూడా వివాదాస్పదమయింది.
నేటి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర ప్రాంతంనుంచి కొన్ని తరాల క్రితం మదరాసుకు వలస పోయిన ఒకానొక వైష్ణవ కుటుంబంలో చిన్నయ జన్మించాడు. ఆయన పూర్వులు పరవస్తు మఠానికి చెందినవాళ్ళు. బ్రాహ్మణేతరులైన సాతాని కులానికి చెందిన ఆ కుటుంబంవారు బ్రాహ్మణ కులస్థుల పద్ధతులు పాటించారు. తాము యజుశ్శాఖాధ్యాయులమనీ, ఆపస్తంబ సూత్రులమనీ, గార్గేయ గోత్రం వారమనీ...............