పాపన్న చదువు
ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడుండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా, తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది.
ఒకరికి సహాయపడట మంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్ళకూ, ఎరిగినవాళ్ళకూ, ఎరగనివాళ్ళకూ, దారిలో కనిపించిన వాళ్ళకూ ఏ విధమైన సహాయం కావలిసివచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు, తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతమూ, బత్తెమూ లేని నౌకరయాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు.
అస్తమానం అందరికి ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయాడు. అదీగాక వాడి సహాయం పొందినవారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో లేక రెండు రాగి డబ్బులో పెడుతూండేవారు. (ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాడు, ఇస్తే తీసుకునేవాడు.) ఇదంతా చూసి వాడి తల్లి, తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది.
కాని రానురాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారయింది. వాడు రోజూ నీళ్ళకోసం చెరువుకు వెళ్ళేవాడు....................