సక్సెస్ స్టోరీ
విమానం బొంబాయి చేరుతున్నట్టుగా పైలట్ హచ్చరిక చేసాడు. ప్రయాణీకు లందరూ దిగే సన్నాహాలలో మునిగిపోయారు. అందరి కళ్ళలో ఉత్సాహం, ఎప్పుడే ప్పుడు దిగుతామా అనే తొందర, మళ్ళీ తమ వాళ్ళను కలుసుకుంటున్నామనే సంతోషం కనిపిస్తున్నాయి ఆ ముగ్గురి కళ్ళలో మాత్రం ఏదో అరాటం, ఆత్రుత, భయం తొంగి చూస్తున్నాయి.
డాక్టర్ మూర్తి ఆలోచనల్లో గతం తవ్వుకుంటున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు... అసలు మళ్ళీ తన దేశానికి తిరిగి వస్తాడని ఎప్పుడూ అనుకోలేదు, చుట్టపుచూపుగా అయినా. 'తన' దేశమా? మూర్తికి నవ్వు వచ్చింది. అదిగో, అందులోనే ఉన్నది కిటుకంతా! తను ఈ దేశం వదలి ముఫ్ఫై ఏళ్ళు అవుతోంది. పుట్టెడు ఆశతో తిరిగి వచ్చి, అంతటి ఆశాభంగమూ పొంది, తిన్న ఢక్కామొక్కీలతో బొప్పులు కట్టిన తలను విదిలించి, “మళ్ళీ జన్మలో ఇక్కడికి రాను!' అని ప్రతిజ్ఞ పట్టి ఇంచుమించు ఇరవైఏళ్ళు అయింది. ఈ దేశానికి తిలోదకాలిచ్చి, ఇంకొక దేశాన్ని తనదనిపించుకుని కూడా పదిహేనేళ్ళు అవుతోంది. అయినా మనసులో ఇది 'తన' దేశంగానే భావిస్తున్నాడు. 'జననీ జన్మభూమిశ్చ' అని ఊరికే అన్నారా? ఇది బలహీనతా? ఆప్యాయతా? ఏమో... ఇక్కడివాళ్ళు ఎలా ప్రవర్తిసారో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు తనని 'తమ' వాడుగా చూస్తారో, పరాయివాడుగా చూస్తారో?.................