మనిషి మనుగడను వివేచిస్తూ “వృద్ధస్తావత్ చింతాసక్తః" అన్నారు జగద్గురువు. ఈ పరమసత్యం వయసు పైబడుతున్న కొద్దీ అనుభవంలోకి వస్తుందనుకుంటాను. అందరికీ భవిష్యత్తు రేపటి పౌరులదయితే, వర్తమానం నేటి యువతది. ఇక గతం మాత్రమే వృదుల అనుభవానికి సంబంధించినది. అందుకే అంత మమకారంగా గతం నెమరు వేసుకోవడం నార్ధక్యంలో.
ఇక స్వవిషయానికి వస్తే బ్రతుకు బాటలో ఎన్ని మెలికలు తిరిగినా, ఎన్ని గతుకులు దాటినా సూటిగా నడిపించినది సప్తస్వరార్చనమే.
అతి బాల్యం నుంచి సప్తస్వరారాధనలో చేదోడు వాదోడుగా ఉండిన సహచరులూ, మార్గదర్శకులైన మహనీయులెందరో గానరసానందలహరిలో ఓలలాడుతు జగత్రసిద్ధులైనవారు కొందరయితే, సంగీతరసాంబోనిధిలో మునిగి, ముక్తులయినవారు మరి కొందరు తిరిగి పలకరిస్తున్నారు స్మృతిపథంలో. ఆ ఆత్మీయులందరితో గడిచిన మధురానుభవాలు తిరిగి స్పందిస్తున్నాయి ఈ బడుగు గుండెలలో. అలనాటి ఆ అమృతస్మృతులకు అక్షరరూపం ఇవ్వాలనే నా ఈ చాపల్యానికి ప్రేరణ యీనాటి నా చింతాసక్తే. .
- పట్రాయని సంగీతరావు
“అయితే నాకేం ఆత్మకథ రాయాలన్న ఆలోచన లేదు అంటారు ఒక చోట. నా దృష్టిలో ఇది ఒక విశిష్టమైన ఆత్మకథ. ఒక మంచి సాహితీ ప్రక్రియ. ఒకటి, తనకి జీవితంలో ఎదురైన, జ్ఞాపకం పెట్టుకోదగిన కొందరి గురించి రాస్తూ, ఆయా సంఘటనలు, సాంఘిక స్థితిగతులు వివరించడం, రెండు, సంగీతమే మొత్తం గ్రంథం అంతా, కానీ అలా కనిపించకుండా ఆయన ఆసక్తిని, అభిప్రాయలని, జ్ఞానాన్ని మనకు చెప్పడం, ఇది ఈ ఆత్మకథ లక్షణం".
- డాక్టర్ పప్పు వేణుగోపాలరావు