భూమి గుండ్రంగా ఉంటుంది
నేను ఉదయం పది గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాను. నిన్న న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బొంబాయిలో అర్ధరాత్రి దిగింది. ఆ తరువాత ఇంకొక విమానంలో విశాఖపట్నం వచ్చాను. బ్యాగుతో బయటకు వచ్చేసరికి అరగంట పట్టింది. అక్కడ ముందే బుక్ చేసుకున్న టాక్సీ నా కోసం ఎదురుచూస్తూ కనిపించింది.
ఆ తరువాత కారు మా ఊరి బాటపట్టింది. ఎప్పుడో పదేళ్ళ క్రితం మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను మా ఊరికి. మళ్ళీ ఇప్పుడే.
ఇక అమెరికా వెళ్ళే అవసరం లేదు. మా ఊళ్ళోనే ఉంటాను. ఇక అమెరికాతో నాకు ఋణం చెల్లిపోయింది.. ఈ రోజు నుంచి స్వేచ్ఛాజీవిని.
వచ్చే ముందు నా భార్య మాధురిని నాతో రమ్మంటే 'నేనా పల్లెటూళ్ళో ఉండలేను. అయినా ముప్పై ఏళ్ళు అమెరికాలో ఉన్న తరువాత ఇండియాలో అందులో పల్లెటూళ్ళో అసలుండలేను' అనీ తన అశక్తతను వెల్లడించింది.
దాంతో నాకు నా కుటుంబంతో ఉన్న ఆఖరి లింకు కూడా తెగిపోయింది. మనిషి పుట్టిన దగ్గర్నుంచీ ఎందరితోనో ఎన్నో బంధాలను ఏర్పరుచుకుంటూ ఏభై ఏళ్ళ వరకు ఎదుగుతాడు. ఆ తరువాత ఒక్కొక్కటిని తెంచుకుంటూ వెళ్ళిపోతాడు. పుట్టినపుడు వంటరిగా, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు కూడా వంటరిగానే వెళ్ళిపోతాము అనీ మా నాన్నగారు చెప్పడం నాకిప్పుడు గుర్తుకు వచ్చి కళ్ళంట నీళ్ళు చెమ్మగిల్లాయి... నాన్న గుర్తుకు రాగానే నా మనసు ఆర్ద్రమైంది. వయసులో ఉన్నప్పుడు నాన్న చెప్పింది వినలేదు; ఇప్పుడు నేను చెప్పింది నా పిల్లలు వినటం లేదు. వినలేదు. ఇదే జీవన వైచిత్రి.
ఏభై ఐదేళ్ళ జీవితంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో విషాదాలు; కళ్ళు మూసి........................