గిరిజనులకు లోకల్ న్యాయం ఇవ్వని కోర్టులు
వారం క్రితం సుప్రీం కోర్ట్ 'లోకల్ ట్రైబల్ రిజర్వేషన్' మీద ఇచ్చిన తీర్పు ఒక ప్రధానమైన ప్రశ్నను మరిచింది. సత్యం అంటే ఏంటి ? సత్యం అన్నది ఒక 'తటస్థ వాస్తవికత'. ఇది అనంతమైన దర్యాప్తుకు నిలబడే విషయం. మనకు కోర్టులు ఉన్నది అందుకే. 790 మంది ఉన్న పార్లమెంటులో ఒక్కో ఐడియాలజీతో, ఒక్కో అజెండాతో ఉండి, కొన్ని అవసరాల దృష్ట్యా తాము ఒక సత్యాన్ని' విడమరిచే దశలో తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు కోర్టు ఎటువంటి స్వార్థపూరితమైన దృష్టి లేకుండా, dispassionateగా విషయాన్ని పరిశీలించి ముఖ్యంగా మనం రాసుకున్న రాజ్యాగ స్ఫూర్తిని అనుసరిస్తున్నామో లేదో గమనించి తప్పులు సరిదిద్దే ఉద్దేశ్యం కలిగిన ఒక సంస్థ సుప్రీం కోర్టు. ప్రతి విషయాన్ని ఒక ఆచరణాత్మక దృక్పథంతో, ఒక ఆదర్శ వాతావరణంలో పరిశీలించాల్సి ఉంది.
క్లుప్తంగా గతంలో జరిగిందేమిటో చూద్దాం. జనవరి 10, 2000న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GO MS No. 3 విడుదల చేసింది. దాని ప్రకారం ట్రైబల్ (షెడ్యూల్డ్) ఏరియాలలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 100 శాతం 'లోకల్ ట్రైబల్' వాసులకు మాత్రమే కేటాయించాలని చెప్పింది. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో హక్కుల యోధుడు బాల గోపాల్ పోట్లాడాడు. ఆ కేసులో విజయం సాధించాక, సుప్రీం కోర్టులో వేసిన అప్పీల్లో వాస్తవం ఏంటి అన్నది వీగిపోయింది. అప్పటి ఆంధ్ర ప్రదేశ్లో ట్రైబల్స్ అధికంగా ఉన్న ప్రాంతాలలో, సెకండరీ గ్రేడ్ టీచర్స్ విషయంలో 100% రిజర్వేషన్ ఈ సూత్రం వర్తించాలని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో అక్కడి పాఠశాలల్లో టీచర్ల స్థానాలు ఖాళీగానో, లేదా హాజరు కాలేని పరిస్థితిలోనో ఉండేవి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ సూత్రం సుమారు ఖమ్మం, విజయనగరం, శ్రీకాకుళం, అదిలాబాద్ మొదలగు జిల్లాలలోని 5938 గ్రామాలకు (అప్పటి ఐక్య ఆంధ్రప్రదేశ్) వర్తిస్తుంది. తీవ్రమైన absenteeismతో బాధ పడుతున్న అక్కడి సెకండరీ గ్రేడ్ స్కూల్కు సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్కు తోచిన నిర్ణయమిది. నిజానికి అది absenteeismకు సంబధించిన సమస్య మాత్రమే కాదు, అది లోకల్ ట్రైబల్స్ కు ఉండే హక్కులకు సంబధించిన విషయం కూడా...................