పోరాటం ప్రతిధ్వనించే వాక్యమతడు
'సుద్దాల హనుమంతు' అనే పేరు తలవగానే మనసుల్లో ఓ వైబ్రేషన్ మొదలవుతుంది. అది ఒక నామవాచకం మాత్రమే కాదు. ఉద్యమ క్రియా పదంం. పోరాటం ప్రతిధ్వనించే వాక్యం. పల్లెటూరి పిల్లగాని వేదనాభరిత జీవన దృశ్యాన్ని జ్ఞప్తికి తెచ్చే పాట. అంతేకాదు నేటి కవులకు, కళాకారులకు దిశను నిర్దేశం చేసే విశేషణ ధ్వని. సుద్దాల సామాన్యుడే, కానీ ఆయన జీవన గమనం, నిర్వర్తించిన కార్యం మహోన్నతం. ప్రేరణాత్మకం. అసామాన్యం. చైతన్యయుత స్ఫూర్తి. అందుకే మళ్లీ మళ్లీ ఆ పేరును తలవాలి. జీవితాన్ని చదవాలి. ఆయన సృజనాత్మక గీతోపదేశాల్ని పుణికి పుచ్చుకోవాలి. ఎందుకంటే అవి నేటికీ అత్యంత ఆవశ్యకమయిన చైతన్యాన్ని నింపుతూనే వున్నాయి. మనుషులకు మరణముంటుంది. కానీ వాళ్ళు బ్రతికిన కాలాలలో చేసిన ఆలోచనలు, జనం కొరకు చేసిన పనులు, ఉన్నతాశయంతో నడిచిన అడుగులు, నిరంతరం వెలుగులు పంచుతూనే ఉంటాయి. అదీ ముఖ్యంగా ఒక కళాకారుని సృజన జనహృదయాలను కదిలిస్తూనే వుంటుంది. చైతన్య జ్వాలను రగిలిస్తూనే వుంటది. అనర్గళం, అనితర సాధ్యమైన మార్గాన ప్రజాశ్రేయస్సు కోసం పయనించిన హనుమంతు జీవితం సజీవ స్ఫూర్తిని అందిస్తూనే వుంటుంది. అందుకే ఈ మననం, ఈ స్మరణం.
తీగలాగితే డొంకంతా కదిలినట్టు, సుద్దాల హనుమంతు జీవితాన్ని, సాహిత్యాన్ని పరామర్శించి చూస్తే, గతంలోని ప్రజల వాస్తవిక చరిత్ర తవ్విపోసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అలా తవ్విపోయటం మరింత అవసరమవుతున్నది. ఎందుకంటే చరిత్రను కూడా వక్రీకరిస్తూ, మనుషుల మధ్య ఆగాధాలను సృష్టిస్తున్న శక్తులు కళా సాహిత్యరంగంలోకి వచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్న సందర్భం ఇది. వాస్తవిక చరిత్రను, ఆయన పాట ప్రతిధ్వనిస్తూనే వుంది. వక్రబుద్ధుల గుండెలపై తూటాలా పేలుతుంది. ప్రగతిశీల శక్తులందరికీ ఆయన కవిత్వం ఆయుధం లాంటిది. నేటి యువతకు మరింత పదును పెట్టే సాధనమది. అందుకే సుద్దాల హనుమంతు జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. మరోమారు జనకళను, జనకవనాన్ని సానపెట్టుకోవాలి. విచ్ఛిన్నకర శక్తుల అసత్య వాదాలను తిప్పికొట్టాలి..........................