ఉపోద్ఘాతం
మిర్జా జాఫరలీఖాఁ 'అసర్' లఖ్నవీ
సర్దార్ జాఫ్రిగారి ఈ సుదీర్ఘ కవితా రూపకం చదివి ఆనందంలో ఓలలాడాను.
కవిత - పురాతనమైనా నవీనమైనా ప్రధమతః కళ, అనే నా అభిప్రాయం ఈ కావ్యం చదివాక మరింత బలపడింది. ఆకర్షకమైన ఇతివృత్తం. అభివ్యక్తితో నవ్యత, కళాత్మక లేకపోతే ఆ కవిత అధమశ్రేణికి చెందుతుంది. కవి ఈ రహస్యాన్ని గుర్తించి తన కవితలో కేవలం సంఘటనలను గాక సంఘటనల వలన ఉద్భవించే అనుభూతులను, ప్రభావాలను, మనస్తత్వాలను పొందుపరిచాడు. ఏవో అస్పష్ట సంకేతాలతో అగమ్యమైన ఆలోచనలను స్ఫురింపజేయడానికి ప్రయత్నించే కవితారీతిని అవలంబించనందుకు నేను జాఫ్రీగారిని అభినందిస్తున్నాను. ఈయన అస్పష్ట సంకేతాలకు బదులు వివరణలను, విడమరచి చెప్పే పద్ధతిని అవలంబించారు. ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రూపకంలో పాత్రల సంఖ్యను తగ్గించారు.
జావీదు, మరియం (భార్యభర్తలు) స్వాతంత్ర్యోద్యమానికి చిహ్నాలు. ఇంగ్లీషువాడు దౌర్జన్యానికి గుర్తు. వార్తావహుడు సంప్రదాయ సిద్ధంగా వున్న వార్తావహుడే. ఇంకా జన్మించని శివువు రానున్న నవతరానికి నాంది. ఇతివృత్తాన్ని బట్టి ఈ కవితను సామ్యవాద సమరంగా భావిస్తే సమంజసం కాకపోదు. ఇది స్వతఃగా ఒక ప్రత్యేకత. ఈ కవితా రూపకాన్ని ఇలా విభజించవచ్చు: -
తొలిపలుకు
ఇందులో భారతదేశ దాస్యాన్నీ, దారిద్ర్యాన్నీ ఒక గాఢాంధకార బంధుర రాత్రితోనూ, ఒక భయంకర పిశాచంతోనూ పోల్చడం జరిగింది. ఈ అంధకారయవనిక తొలిగిపోవాలంటే విప్లవం అవసరం. ఈ విప్లవానికి మానవుని ఆత్మవికాసమే కేంద్రకం. ఈ విప్లవ ఉద్దేశ్యం కేవలం ఉన్మాదోద్రేకాలు కావు. నూతన వ్యవస్థానిర్మాణమే ఈ విప్లవానికి గమ్యం. ఆ నూతన వ్యవస్థ స్వరూపం కవిమనసులో వుంది అయితే దాన్ని భావితరం వాళ్లకు వదిలెయ్యలేదు..................