పన్నెండేళ్ళ కల్పన ఒక సోమవారం రోజున తప్పిపోయింది. మంచి వర్షాకాలంలోని ఆ ఉదయాన, మనసులో ఆలోచనలు మేఘాలవలె ముసురుతుండగా, ఎప్పటిలానే ఇంట్లోంచి వెళ్లింది కల్పన. స్కూలు బ్యాగూ, ఓ చిన్న గొడుగూ పట్టుకుని బయల్దేరింది. స్కూలు పదినిమిషాల్లో చేరేంత దూరమే. ఆమె రోజువారీ అలవాటు ప్రకారం అయితే దారిలోని దుకాణదారుడిని పలకరించేది, చిన్న టీ కొట్టు వెలుపల కూర్చుని ఉండే ఆ దుకాణం ఆయన తల్లికి చెయ్యి ఊపేది, పూజారి ఇంటి గేటు దగ్గరి గోధుమ వన్నె ఆవు దగ్గరికి వెళ్ళి దాని బక్కచిక్కిన నుదుటిపై ప్రేమగా నిమిరేది. కానీ, ఆ సోమవారం రోజున ఏదో పరధ్యానంలో పడి, ఈ రోజువారీ పనులేవీ చెయ్యలేదు. 'అసలు మన కల్పన మాదిరే లేదు', అన్నది టీ కొట్టు దగ్గరుండే ఆవిడ, కల్పన కనబడటం లేదన్న సంగతి విన్నప్పుడు 'మన' అనే మాటను నొక్కి పలుకుతూ. కల్పన తల్లిదండ్రులకూ, నాయనమ్మకూ ఆమె ఇవ్వగలిగిన ఓదార్పు అదొక్కటే.
కల్పన నాయనమ్మకు, ఆ స్థానమే ఆవిడ పేరుగా స్థిరపడి పోయింది. ఆమెనందరూ 'అజ్జి' అనే పిలవటంతో ఆమె అందరికీ నాయనమ్మే అయిపోయింది. ఆమె అసలు పేరు ఏమిటో ఎవరికీ గుర్తేలేదు, ఆవిడ కొడుకుతోసహా, ఎండాకాలంలో అయిదడుగుల ఎత్తుకు కాస్త తక్కువగానూ, వర్షాకాలంలో మరింత కుంచించుకు పోయినట్టుగానూ కనబడుతుందామె. ఎప్పుడూ దేవుళ్ళతో సంభాషిస్తూ ఉంటుందనే ప్రచారంవల్ల ఆమెకొక మహోన్నతమైన హోదా ఏర్పడిపోయింది. కల్పన తప్పిపోవటం అందరికన్నా ఎక్కువగా ఆమెనే దెబ్బతీసిందని అందరికీ అనిపించింది.
బడి వదిలినా కల్పన ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తప్పిపోయిన సంగతిని గమనించారు. ఒంట్లో బాగాలేక రాలేదేమోనని టీచర్లు అనుకున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు జబ్బు పడుతూ ఉండటం మామూలే......................