ప్రశ్నిస్తే?
మనిషికి ఉన్న ఒక అద్భుత గుణం, ఆలోచన జ్ఞానం. ఆ ఆలోచనల నుండి బయటపడేది ప్రశ్నించే తత్వం. ప్రశ్నించడం అనేది ప్రతి మనిషికి ఉన్న హక్కు. ఆ హక్కుతోనే అభివృద్ధి సాధ్యం. అయితే మనిషి ప్రశ్నించకపోవడానికి కారణాలు అనేకం. అటువంటి అనేక కారణాలలో నాకు, నా మనసుకి అనిపించిన కొన్ని కారణాలతో నేను రాసుకున్న నా ప్రయాణం ఈ నవల.
ఒక కొత్త కుక్క తన ప్రాంతం నుండి ఏ కారణం చేతనైనా మరొక ప్రాంతంలోకి వస్తే, అక్కడి కుక్కలు ఆ కుక్కని అరిచి, కరిచి, వెక్కిరించి, వెంబడించి అక్కడినుండి తరిమేసే వరకు నిద్రపోవు. అయితే ఎందుకు? తమ అస్తిత్వానికి సమస్య వస్తుందనా? లేక తమ తిండికి లోటు ఏర్పడుతుందనా? ఏంటి వాటి భయాలు? నాకే కనుక కుక్కల భాష వస్తే తెలుసుకోవాలనుకుంటున్న మొదటి కారణం ఇదే. వలస వచ్చిన ప్రతి జంతువు ఎదుర్కోవలసిన మొదటి సమస్య, మనిషితో సహా.
మనిషి ఒక తప్పుని ప్రశ్నించిన వెంటనే ఎదుర్కోవలసిన మొదటి ప్రశ్న, "ఎవడ్రా నువ్వు? ఎక్కడినుండి వచ్చావ్?” ఈ ఒక్క భయం చాలు, మనిషిని, అతని ప్రశ్నలను మనసులోనే దాచుకొని అన్ని మూసుకొని బ్రతికేలా చేయడానికి. అలా ప్రతి సాధారణ పౌరుడు సాంఘిక, సామాజిక, రాజకీయ, ప్రాంతీయ, కుల, మత, వర్ణ, వర్గాల తేడాల కారణాలతో తనలోని ప్రశ్నలను అణుచుకోవలసి వస్తుంది.
కొంత మంది ఆ ఊపిరాడనివ్వని ఉక్కపోత వల్ల బయటపడి ప్రశ్నించి మార్పుని సాధించినవాళ్ళు లేకపోలేదు. అలా అందరూ, చూసిన తప్పులను ప్రశ్నించిన రోజు ఆలోచన జ్ఞానంలో మార్పు, సామాజిక అభివృద్ధిలో మార్పు కళ్ళకు కనపడుతుంది.............