మొదటి భాగము
ఉపనిషద్విజ్ఞాన సౌరభము
ఉపక్రమము
ఉపనిషత్తుంటే రహస్య విజ్ఞానమని అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. మానవుని అనుభవంలో లేనిదేదో అది రహస్యం. ఇలాంటి రహస్యాలు రెండిటిని బోధిస్తున్నది మనకుపనిషత్తు. ఆత్మ అనే పదార్ధముందని ఒకటి. అది తప్ప దానికి భిన్నంగా మరి ఏదీ లేదని ఒకటి. నిజానికి ఇవి రెండూ రెండు రహస్యాలే. ఎందుకంటే ఇవి మన అనుభవంలో లేవు. మన అనుభవాన్ని బట్టి మాట్లాడితే ఉపనిషత్తులుందని చెప్పే ఆత్మ మనకెక్కడా కనపడటం లేదు. మీదుమిక్కిలి అవి లేదని చాటే అనాత్మ ప్రపంచ మెక్కడబడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నది. ఇటు లోకదృష్టికి గాని అటు శాస్త్ర దృష్టికిగాని అందే విషయం కాదిది. పోతే ఒక ఉపనిషత్తు మాత్రమే వీటి రెండింటినీ మనకు ఘంటా పథంగా చాటుతున్నది.
అయితే అనుభవంలో లేనిది ఉపనిషత్తు చాటితే మాత్రం అది ఎలా నమ్మటమని ప్రశ్న వస్తుంది. అనుభవంలో ఉండటమూ లేకపోవటంతో నిమిత్తంలేదు. ఆ మాటకు వస్తే అనుభవంలో ఉన్నదంతా యధార్ధమని చెప్పలేము. ఒకప్పుడు సత్యమసత్యంగానూ అసత్యం సత్యంగానూ అనుభవానికి రావచ్చు. అంతరిక్షంలో ఎంతో పెద్దవిగా ఉన్న నక్షత్రాలు మన కంటికి చాలాచిన్నవిగా కనిపిస్తాయి.................................