ఉపనిషత్తులు
సృష్టి ప్రారంభంలో పరబ్రహ్మ వేదాలను చతుర్ముఖ బ్రహ్మకు ఇచ్చాడు. అక్కడ నుంచి గురుశిష్య పరంపరగా వేదాలు విస్తరించాయి.
వేదాలు మొత్తం నాలుగు 1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అథర్వణవేదము. ద్వాపరయుగందాకా, నాలుగు వేదాలు కలిపి ఒకటే వేదంగా ఉండేది. అలా ఉన్న వేదాన్ని ప్రజలు చదివి అర్థం చేసుకున్నారు. కాని ద్వాపరయుగం చివరకు వచ్చేసరికి, వేదాలను అర్థం చేసుకునే శక్తి ప్రజలకు సన్నగిల్లింది. దాంతో వేదాలకు ఆదరణ తగ్గింది. అప్పుడు బ్రహ్మదేవుడు అపాంతరతముడు అనే మానస పుత్రుణ్ణి సృష్టించి, భూలోకంలో వేదాలకు ప్రచారం కావించమన్నాడు. అపాంతరతముడు వేదవిభజన చేసి, ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి, తన శిష్యులద్వారా వేదానికి బహుళ ప్రచారం కావించి, వేదవ్యాసుడు అనబడ్డాడు.
వేదం మొత్తం నాలుగు భాగాలుగా ఉంటుంది. 1. సంహిత 2. బ్రాహ్మణము 3. అరణ్యకము 4. ఉపనిషత్తు.
వ్యాసుడు వేదవిభజన చేసిన తరువాత, శాఖోపశాఖలుగా వేదం బహుళ ప్రచారం పొందింది. వేదశాఖలు ఎన్ని అన్నప్పుడు అందులో భిన్నాభిప్రాయా లున్నాయి. ముక్తికోపనిషత్తు ప్రకారం.
ఋగ్వేదాది విభాగేన వేదాశ్చత్వార ఈరితాః
తేషాం శాఖా హ్యనేకా స్స్యు స్తా సూపనిషద స్తథా |
ఋగ్వేదస్య తు శాఖాః స్యు రేకవింశతి సంఖ్యయా,
నవాధికశతం శాఖా యజుషో మారుతాత్మజ,
సహస్రసంఖ్యయా జాతా శ్శాఖా స్సామ్నః పరంతప,
అధర్వణస్య శాఖాస్స్యుః పంచాశద్భేదతో హరే ॥
ఋగ్వేదానికి 21 శాఖలు
యజుర్వేదానికి 109 శాఖలు
సామవేదానికి 1000 శాఖలు
అథర్వణవేదానికి 50 శాఖలు
----------------------------------
వెరసి 1180 శాఖలు.............