నిరీక్షణ
ఉదయం ఎనిమిది గంటలు చిరు ఎండ చిటపటలాడుతోంది. పొలాల
మధ్య నుంచి నడుస్తున్నాం. దున్నిన నాగలి చాళ్ళలో మట్టి పెళ్లల మధ్య అడుగులు కూరుకుపోతున్నాయి. రాత్రి చిరుజల్లు పడిందేమో మట్టిపొర తడిసి చెప్పులకు అంటుకుంటోంది. అసౌకర్యమే అయినా అది దగ్గరి దారట మరి. పొలాలను రెండుగా చీల్చుతున్న మట్టిరోడ్డు ఎక్కాం. ఆ రోడ్డును ఆనుకొని నీళ్ళు లేని సన్నని కాలువ. కానీ ఆ కాలువ ఉన్నట్లు ఎవ్వరూ గమనించలేరు. ఆ పక్కనే ఎర్రటి రంగులో మూడు సమాధులు. వాటిలో ఒకటి మొన్ననే కట్టారు. ఆ విషాదానికి గుర్తుగా చెట్లపైన రెపరెపలాడుతున్న జెండాలు. వాడిపోయి సమాధులకు అతుక్కుపోయిన పూలదండలు, పూలరెక్కలు. మేం ముగ్గురం అక్కడికి చేరాం.
'నా కొడుకు సరిగ్గా నెలకింద ఈ రోజే కదా చనిపోయింది. సరిగ్గా ఈ సమయానికే ఆ దుర్వార్త నాకు తెలిసింది'.
నేను టక్కున ఆగాను.
ఏమన్నదామె?
అవును. తన కొడుకు మరణవార్త విని నెలరోజులు. నిన్నటి నుంచి నేను తనతోనే ఉన్నాను కదా. నాకెందుకు గుర్తుకు రాలేదు. ఆమె ఇప్పటిదాకా నాతో అననూ లేదు. ఇప్పుడు స్వగతంలా లోలోపలి మాటలు చెప్పుకుంటూ సమాధుల వైపు నడిచిపోతోంది. వాటిలో ఒకటి ఇటీవలే బెజ్జంకిలో అమరుడైన ఆమె కొడుకుది. మిగతా రెండూ ఆ ఊరికి చెందిన మరో ఇద్దరు విప్లవకారులవి. అందులో మొదటిది మా ముందు నడుస్తున్న రైతు కొడుకుది..............