కామ్రేడ్ సీతారామ్క నివాళి
- ప్రకాశ్ కరత్ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు
కామ్రేడ్ సీతారాం ఏచూరి గురించి గతించిన కాలపు (పాస్ట్ టెన్స్) భాషలో రాయడం నాకు చాలా కష్టంగాను, బాధగానూ ఉంది. మా రాజకీయ జీవితాలు ఐదు దశాబ్దాలుగా అత్యంత సన్నిహితంగా పెనవేసుకుపోయాయి. పార్టీ, వామపక్ష ఉద్యమం వివిధ దశల్లో చవిచూసిన ఆటుపోట్లను ఇద్దరమూ ఎదుర్కొన్నాం. యాబై ఏళ్ల క్రితం, 1974లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎస్ఎఫ్ఎస్ఐలో మా మధ్య మొదలైన భావసారూప్య స్నేహం తరువాత పార్టీలో కూడా కొనసాగింది. పార్టీ కేంద్రంలో మేమిద్దరం 37 ఏళ్లపాటు కలిసి పనిచేశాం. నేను 1985లో పార్టీ కేంద్రానికి వచ్చాను. రెండేళ్ల తరువాత సీతారాం వచ్చి చేరారు. అప్పటి నుండి మా ప్రయాణం ఒకే దిశలో కొనసాగింది. 1984లో మేం ఇద్దరం కేంద్ర కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగానూ, 1985లో జరిగిన పార్టీ 12వ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యాం. 1988లో జరిగిన 13వ మహాసభలో కేంద్ర కార్యదర్శివర్గంలోకి, 1992లో జరిగిన 14వ మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యాం. పార్టీ కోసం, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమ అవసరాల కోసం సీతారాం చేసిన కృషిని నికరంగా అంచనా వెయ్యడానికి మరింత సమయం, మరింత చర్చ అవసరం. ప్రస్తుతానికి.. పార్టీకి సైద్ధాంతికంగా, కార్యక్రమ పరంగా, రాజకీయ పరంగా సీతారాం చేసిన ప్రత్యేక తోడ్పాటు గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.
వివిధ లౌకిక ప్రతిపక్ష పార్టీల నాయకులతో సీతారామ్క ఉన్న సంబంధాలు, ఆ పార్టీలను ఒకే ఉమ్మడి వేదిక మీదకు తీసుకురాగలిగిన సామర్ధ్యం గురించి ప్రధాన స్రవంతి మీడియాలో విస్తృతంగానే వచ్చింది. ప్రజా కార్యక్షేత్రంలో సీతారాం కృషి వాస్తవమే. అయితే నేను పార్టీకి, మార్క్సిజానికి సీతారాం అందించిన కీలకమైన తోడ్పాటు గురించి ప్రధానంగా ప్రస్తావించదలిచాను. పార్టీ కేంద్రంలోనూ, పొలిట్ బ్యూరో సభ్యుడిగా మార్క్సిజం - లెనినిజం ఆధారంగా పార్టీని సైద్ధాంతికంగా నిలబెట్టేందుకు సీతారాం చేసిన కృషి ప్రత్యేకమైనది.................