నాన్న
"నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇది 'అల్జీమర్స్' అనిపిస్తోంది" అన్నాడు డాక్టర్ శ్రీవాస్తవ్.
"అవునా? మరి ఏం చెయ్యాలి?” కొంచెం ముందుకు వంగి ఆందోళనగా అడిగాడు నందన్. ఇంతలో ఎవరో తలుపు కొట్టడంతో “కమిన్” అన్నాడు శ్రీవాస్తవ్.
టేబుల్ మీద కాఫీ పెట్టి బాయ్ వెళ్ళిపోయాక, "దీనికి ట్రీట్మెంట్ లేదు నందూ! తాత్కాలిక ఉపశమనం తప్ప ఏమీ చేయలేం. డూ వన్ థింగ్. రేపు నాన్నగారిని హాస్పిటల్కి తీసుకురా. అవసరమైన టెస్టులు చేద్దాం” అని కప్ అందుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు నందూ. "కాఫీ తీసుకో" అన్నాడు శ్రీవాస్తవ్. కార్ డ్రైవ్ చేస్తూ వారం రోజులుగా తండ్రి గురించి వింటున్న విషయాలు నందూకు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి.
ఫోన్ రింగవుతుంటే లిఫ్ట్ చేసి “చెప్పు శ్రావణీ” అన్నాడు నందన్. "మీ నాన్న రోజురోజుకీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. సాయంత్రం చింటూని పార్క్కి తీసుకెళ్లి అక్కడే వదిలేసి ఒక్కడే ఇంటికి తిరిగొచ్చాడు" అని గుక్క తిప్పుకోకుండా విషయం చెప్పింది.
"సరే, ఆఫీసులో ఉన్నాను. మళ్ళీ మాట్లాడతాను" అని కాల్ కట్ చేయబోయాడు. "నో, ఇప్పుడే మాట్లాడు లేదా ఇంటికిరా" అని గట్టిగా అరిచింది శ్రావణి.....................