ప్రాస్తావికం
సువర్ణపుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయః,
శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చజానాతి సేవితుమ్.
కదనరంగంలో విరాజిల్లితే శూరుడు, కవన రంగంలో కళలు విరజిమ్మితే సూరుడు (పండితుడు), ఏయే వేళలకేమి కావలెనో తెలిసినవాడు చతురుడు. ఈ త్రిమూర్తులకు వసుంధరాదేవి సువర్ణసుమాలనే అందిస్తుంది. ఈ భూమండలంలో శీతగిరీంద్రమే శ్వేతచ్ఛత్రంగా చల్లగా తన నీడలో కాపాడే మాతృభూమి మన భరతభూమి. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకూ ఆరు ఋతువులు ఆహార్యంతో, నదీ తరంగాల మృదంగనాదాలతో, ఏటి గలగలల మువ్వల సవ్వడితో, ద్విజరాజుల సుస్వరాలతో నటరాజుకు నాట్య నీరాజనాన్ని అందించే ప్రకృతికాంత ఒడిలో పరవశించని వారుంటారా? శివుని జుటాజూటం నుండి జాలువారిన గంగా తరంగాలు ఉత్తర భారతాన్ని సస్యశ్యామలంగా అలరిస్తుంటే నేనున్నా మీకంటూ గోదావరీ కెరటాలు దాక్షిణ్యంతో దక్షిణ దిశను ఆదుకున్నాయి. సాగర మేఖలగా వర్ణించబడే భూమాత ముద్దుబిడ్డగా, తరంగిణుల మువ్వలవడ్డాణంతో మురిపించే అందాల భామ కోనసీమ. గోదావరీ మధుర జలాల జలకమాడి, ఆకుపచ్చని అరటిఆకుల చీర సింగారించుకుని వయ్యారంగా, నారికేళాలను దోసిట ఉంచుకుని నవవధువులా సాగరవరుని చేరే శు భవేళ లోకకళ్యాణమే సుమా!
కోనసీమలో గోదావరి గలగలలలో మధుర గంభీరమైన వేదనాదాలూ నినదిస్తాయి. ఈ కోనసీమలో ఒక ఇందుపల్లి. పేరుకు తగినట్లుగా విజ్ఞాన చంద్రికలను విరజిమ్మే పల్లెసీమ అది. దాదాపు ఒకటిన్నర శతాబ్ది క్రితం వేదమూర్తులతోనూ, శాస్త్ర నిధులతోనూ విరాజిల్లే ఆ 'ఇందుపల్లి' లో 'పుల్లెల' వారి వంశం 'జమిందారీ 'పుల్లెల' గా అందరి మన్ననలనీ అందుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒకానొక..............................