పద బంధాలు.. అనుబంధాలు!
మీకో మాట చెప్పాలి. అందుకు భాష కావాలి. భాషలో భావముండాలి. భావంలో అర్థం ఉండాలి. అందం ఉండాలి. అనుభవం ఉండాలి. అనుభూతి ఉండాలి. సారముండాలి. ఆలోచన అందాలి. అది ఇచ్చి పుచ్చుకొనేదై ఉండాలి. అంతే స్పష్టంగా ఉండాలి. సూటిగా ఉండాలి. ధ్వని సహితం ఉండాలి. వెరసి వ్యక్తీకరించేదై ఉండాలి. సహజాతమంత సహజమైనదైపోవాలి. పలుకు పలికితే అనుసంధానం అయ్యి తీరాలి.
ఇవన్నీ ఉన్నా భాష దానికదిగా ఉండిపోదు. వాడుకలో తనని తాను దిద్దు కుంటుంది. కొన్నిటిని చేర్చుకుంటుంది. మరికొన్నిటిని విసర్జిస్తుంది. అప్పుడే అది విస్తరిస్తూ పోతుంది. లేదంటే నిలవ నీరు అయిపోతుంది. అక్కరకు రాకుండా స్మృతిగా మిగులుతుంది. స్థిరంగా ఉన్న సంస్కృతం జీవభాష కానిదందుకే. మార్పులకు లోనై ప్రాకృతం అంటున్నది మనగలిగినదీ అందుకే. ప్రాకృతం అంటే తక్కువైనది. నీచమైనది. సాధారణమైనది. స్త్రీలు మాట్లాడేది. ఈ ప్రాకృతాలు ఆరు విధాలు. ఆడవాళ్ళకూ హాస్యగాళ్ళకూ కేతిగాళ్ళకూ ప్రాకృతభాష, అధములకు సౌరశేని, అధమాతి అధములకు మాగధి, రాక్షసులకూ పిశాచాలకు పైశాచి- చూళికా పైశాచి, చండాల యవనాదిలకు అపభ్రంశం భాషలను ఆపాదించారు. అంటే భాషకూ వర్గముంది. కులమూ ఉంది. మతమూ ఉంది. లింగమూ ఉంది. ప్రాంతమూ ఉంది.
అయినా భాషను జీవభాషగా నిలిపి ఉంచడంలో సామెతలూ, నానుడులూ, పొడుపు విడుపులూ, నుడులూ, పలుకుబడులూ, జాతీయాలూ తమవంతు పాత్రని పోషిస్తాయి. పురాణాల నేపథ్యంలో మరిన్ని పద బంధాలు విడదీయలేని నిత్య అనుబంధమైపోయాయి. మణుగుల కొద్దీ మాటలకన్నా ఒక్క మాట చాలు. మాట వెనక మర్మాన్ని సయితం పట్టిస్తుంది. అందవలసింది అందిపోతుంది. చేరవలసింది. చేరిపోతుంది.
అయితే రాజకీయార్ధంలో చూసినప్పుడు పురాతనమే పురాణమైన పద బంధాల్లో ఆమోదించేవీ, విభేదించేవీ రెండూ కనిపిస్తాయి. దానికన్నా ముందు ఒకే జాతీయం/ పురాణ పద బంధం తీసుకుని చూస్తే లిఖితంలో ఒకలా, మౌఖికంలో మరోలా భిన్నంగా కనిపిస్తాయి. వాటి మధ్య వైరుధ్యమూ కనిపిస్తుంది. 'త్రిశంకు స్వర్గం',.............