అతనికంతా తెలుసు
30 జూలై 1982
తెల్లవారిన ప్రతిరోజూ ఆమెకో వింత. అతను కళ్ళు తెరుస్తూనే ఆమెకోసం ఆరాటపడతాడు. స్నానంచేసి, కాటుక బొట్టు పెట్టుకుని రాత్రంతా మంచులో తడిసిన కలువపువ్వు పొద్దున్న లేత సూర్యుడి కిరణాలు సోకి తళుక్కున మెరిసినట్టుగా కనిపించాలి ఆమె అతనికి. ఆమె అలాగే తన ముఖాన్ని అతనికి దగ్గరగా చేర్చి భక్తిభావంతో చూస్తుంది. అతను చిటిక వేస్తాడు బుగ్గమీద. పూర్తి మెళుకువతో లేచి మంచంమీద బాసింపీట వేస్తాడు.
“సుశీలా... ఈరోజు యేమయ్యిందో తెలుసా... తిరుపతి ఘాట్ రోడ్డు దగ్గర పెద్ద బస్సుప్రమాదం తప్పిపోయింది. లోయలోకి పడిపోవాల్సిన బస్సు డ్రైవరు సమయస్ఫూర్తి వల్ల నిలదొక్కుకుంది. ప్రయాణీకులందరూ క్షేమమే కాని ఓ వ్యాపారి, ఆయనికి గుండెజబ్బు. ఆయన ప్రమాదభయంతో గట్టిగా అరిచి బస్సులోనే ప్రాణం విడిచేశాడు.”
సుశీల మంత్రముగ్ధురాల్లా వింటూంది. భర్త రాజారావు మాట్లాడుతుంటే ఆమెకి పెదిమ కదపకుండా గంటలతరబడి వినాలని వుంటుంది. అతను వార్త చెప్పి లేచి బాత్రూమ్కి వెళతాడు.
సరిగ్గా అప్పుడే జరుగుతుంది వింత.
బాయ్ విసిరిన పేపర్ నడవలోకి వచ్చిపడుతుంది. సుశీల పేపరు చేతిలోకి తీసుకుని ఆత్రంగా పేజీలు తిరగవేస్తుంది. భర్త చెప్పిన వార్త కనిపిస్తుందామెకి. కొద్దిమార్పుతో అతను చెప్పిన వార్తంతా వుంటుంది.
"క్లయిర్ వాయిన్స్, జీన్ డిక్షన్ అనే అతీంద్రియ శక్తుల గురించి విన్నాను" అన్నాడు రామానుజం గ్లాసు నింపుకుంటూ.
“ఆగు... పూర్తిగా చెప్పనీ...” అన్నాడు సుందరం గ్లాసులో మిగిలిన ద్రావకం ఒక్కగుక్కలో పూర్తిచేసి.................