శ్రీ క్షేత్ర వైభవం (పూరీజగన్నాధ క్షేత్ర మహాత్మ్యం)
పూరీ జగన్నాథం - ఓడ్రదేశము
| పూరీజగన్నాథం (పురుషోత్తమ క్షేత్రము) ఓడ్రదేశ వర్ణనము
ఏ దేశమునందు పురుషోత్తమమను క్షేత్రమున్నదో ఎచట నారాయణుడు దారు విగ్రహమ్ ప్రకాశించుచున్నాడో సవివరముగా చెప్పమని మునులడుగగా జైమిని ముని వారి కిట్లు బదులు చెప్పెను.
"ఉత్కలనామముగల దేశము పరమ పావన మయినది. అచటఅనేక తీర్థములు పుణ్యదేవాలయతనములు కలవు. దక్షిణ సముద్రతీర మాదేశము నందున్నది. అందున్న జనులు సదాచారయుతులు, భూసురులు, సచ్ఛీలురు. అధ్యయన సంపన్నులు, యజ్వులు. వారు సృష్ట్యాదిని వేదశాస్త్ర ప్రవర్తకులై వేదాధ్యయనమును క్రతువులను చేసిరి. ఆ దేశము అష్టాదశ విద్యలకు నిధానము. నారాయణుని ఆజ్ఞచే లక్ష్మి ప్రతిగృహమునందు నివసించు చున్నది. అట్టి వైష్ణవజనులు లజ్జాశీలురు, జితేంద్రయులు, శారీరక మానసిక రోగములేనివారు, పితృమాతృభక్తి గలవారు.
సత్యవాక్పరిపాలకులు. అచ్చటి విష్ణుభక్తుడైనను నాస్తికుడు కాడు. మరియు ఆ దేశ ప్రజలు దీర్ఘాయుష్కులు. ఉత్కల దేశమందున్న క్షత్రియులు స్వక్ష్మ నిరతులు. ప్రజారక్షణ దీక్షితులు, దానశీలురు, శస్త్రశాస్త్ర విశారదులు, వారు సతతము బూరి దక్షిణలిచ్చి క్రతువులు చేయుచున్నారు. ఉత్కల దేశమందున్న వైశ్యులు కృషి వాణిజ్య గోరక్షావృత్తి నవలంబించినవారు. వీరు దేవ గురు ద్విజులకు భక్తితో ధనమర్పించి ప్రీతినొందించుచున్నారు. ఒక వైశ్యుని ఇంటికి వెళ్ళిన యాచకుడు మరియొకరి ఇంటికి వెళ్లరాదు. అచటి వైశ్యులు సంగీతకావ్య కళాశిల్పులు. ఉత్కతల దేశ శూద్రులు ధార్మికులు, స్నానదానక్రియారతులు, వారు మనో వాక్కాయ కర్మలచే దాన ధర్మములు చేసి ద్విజులను పూజింతురు.
ఇచట ఋతువులు నియమములను తప్పవు. మేఘము అకాలమున వర్షించదు. సస్యహాని కలగదు. గాలి, ఆకలి ప్రజలను పీడించవు. దుర్భిక్షము లేక దేనికిని భంగముండదు. భూమిపైనున్న ఏ వస్తువైనను అచట దొరకదన్న మాటలేదు. అంతేగాక మనోహరములైన వృక్షములు కూడ ఉత్కల దేశమునందు వ్యాపించియున్నది. దక్షిణ సముద్రమువైపు ప్రవహించు ఋషి కుల్యానది మొదలుకొని స్వర్ణరేఖ ఆ మహానదుల మధ్యను ఉత్కలదేశము...........