అధ్యాయం 23
పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిజానికి పరివర్తనాకాల ప్రధాన లక్షణాలు
కార్మికవర్గ విప్లవమూ - పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిజానికి ఒక పరివర్తనా కాల ఆవశ్యకత
పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన మొత్తం క్రమమూ, బూర్జువా సమాజంలో వర్గ పోరాటమూ అనివార్యంగా పెట్టుబడిదారీ విధానాన్ని సోషలిజం విప్లవాత్మకంగా కూలద్రోయడానికి దారి తీస్తాయి. సోషలిజానికి పరివర్తనకు ఒక ముందస్తు భౌతిక అవసరమైన భారీ యంత్ర పరిశ్రమను పెట్టుబడిదారీ విధానం నిర్మిస్తుంది. ఈ పరివర్తనను సాధించే ఒక సామాజిక శక్తిని కార్మిక వర్గ రూపంలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి సిద్ధం చేస్తుంది. పైన వివరించినట్లు, సామ్రాజ్యవాద యుగంలో అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి శక్తులకూ, ఈ ఉత్పత్తి శక్తులకు సంకెళ్ళుగా మారిన బూర్జువా ఉత్పత్తి సంబంధాలకూ మధ్య సంఘర్షణ కనీవినీ ఎరుగని తీవ్రతను సంతరించుకుంటుంది. ఉత్పత్తి శక్తుల స్వభావానికి అనుగుణంగా ఉత్పత్తి సంబంధాలు తప్పనిసరిగా ఉండాలనే సూత్రం పాత బూర్జువా ఉత్పత్తి సంబంధాల రద్దుకూ, నూతన సోషలిస్టు ఉత్పత్తి సంబంధాల సృష్టికీ దారి తీస్తుంది. ఆ కారణంగా కార్మిక వర్గ సోషలిస్టు విప్లవానికి ఒక వస్తుగత ఆవశ్యకత తుంది.
బూర్జువా, సోషలిస్టు సమాజాల పునాదులు విరుద్ధ స్వభావం కలిగి ఉండడం వలనా, పెట్టుబడికీ శ్రమకూ విరుద్ధ ప్రయోజనాలు ఉండడం వలనా, కొంతమంది అవకాశవాదులు ప్రచారం చేస్తున్నట్లు పెట్టుబడిదారీ విధానం శాంతియుతంగా 'ఎదిగి' సోషలిజం ఏర్పడదు. పెట్టుబడిదారీ విధానాన్నుండి సోషలిజానికి పరివర్తన కార్మిక వర్గ విప్లవం ద్వారానూ, కార్మిక వర్గ నియంతృత్వం ద్వారానూ మాత్రమే సాధ్యపడుతుంది..........................