రాజరాజనరేంద్రుడు శ్రీకారం
1
శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే శ్రీకారంతో మొదలయింది నన్నయభట్టు భారత ఆంధ్రీకరణం. బ్రాహ్మణోత్తములు నిర్ణయించిన శుభముహూర్తం సమీపించగానే నన్నయ తాటియాకుల గ్రంథంపై ఘంటంతో శ్రీకారం చుట్టాడు. ఆంధ్రవాగ్మయానికి ఆదికవి అయ్యాడు.
అది చాళుక్య యుగం. పవిత్ర జలతరంగ విభావరి అభంగ గోదావరి తీరం. రాజమహేంద్రవరం. చాళుక్యుల రాజధాని, మొదటగా తెలుగు భాషకు పట్టంకట్టిన పవిత్ర క్షేత్రం. తెలుగు కావ్యరచనకు పుట్టినిల్లయింది.
అది శాలివాహన శకాబ్ది 975. కలియుగారంభం నుంచి లెక్కవేస్తే 4154 వ సంవత్సరం.
నన్నయభట్టు సంస్కృతాంధ్రాలలో గొప్పకవి. చూడడానికి గుమ్మడిపండులా ఉంటాడు. ముఖాన మూడు విభూదిరేఖలు కుంకుమ బొట్టు. తల వెనక ఆవు గిట్టంత పిలక, చివర ముడి. మెడలో బంగారు తీగతో చుట్టిన రుద్రాక్షమాల. జగమెరిగిన బ్రాహ్మణుడైనా పది ముడుల యజ్ఞోపవీతం ధరించాడు.
రాజరాజనరేంద్రుడు చాళుక్యవంశ జలధి చంద్రుడు. రాజమహేంద్రవరం రాజధానిగా తెలుగునేల నేలుతున్న ప్రభువు. ఆయనకు వ్యాసమునీంద్రుడు రచించిన మహాభారతమంటే మక్కువ ఎక్కువ. ఎన్నిసార్లు చదివించుకుని విన్నా తనివి తీరేదికాదు. కానీ అది జటిలమైన సంస్కృత గ్రంధం. అందరికీ అర్ధంకాదు.
రాజరాజనరేంద్రుడు నన్నయభట్టును వ్యాసభారతాన్ని ఆంధ్రభాషలో అనువదించమని కోరాడు. నన్నయ అంగీకరించాడు. పెద్దలు సుముహూర్తం నిర్ణయించారు. ఆంధ్రవాగ్మయానికి ఆరంభ సభా సంరంభం మొదలయింది.
అంతకు ముందు తెలుగు భాషలో కొన్ని పద్యాలు వచ్చాయి. కాని కావ్యరచనకు ఎవరూ పూనుకోలేదు. ఆంధ్ర భాషామతల్లి పాదాలచెంత తొలి కావ్యపుష్పం సమర్పించే భాగ్యం నన్నయ కవికి దక్కింది.
తెనుగుసేతలో మొదటి అడుగు పడగానే ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. నన్నయ ఒకక్షణం విరామం తీసుకున్నాడు. గోపాలదేవుని మనసులోనే ధ్యానించాడు. రామాయణం మనకందించిన వాల్మీకి మహర్షినీ మహాభరతమనే ఐదవ వేదాన్ని మనకందించిన వ్యాసమునీంద్రుడిని ధ్యానించాడు.
అప్పటికి శ్లోకంలో నాలగో వంతయింది. నన్నయ కుమారుడు అనంతశర్మ. అతడు ఆ శ్లోకపాదాన్ని సభలోపల సభ వెలుపల నిరీక్షిస్తున్న సాహితీ ప్రియులందరికీ ఆనందం..............