వివేక చంద్రిక అను
రాజశేఖర చరిత్రము
మొదటి ప్రకరణము
ధవళగిరి - దేవాలయవర్ణనము - గోదావరి యొడ్డున నున్న ధర్మశాల
మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు వచ్చి కూర్చుండుట.
అప్పుడచ్చటికి వచ్చిన సిద్ధాంతి మొదలగువారి స్తుతివచనములు -
అందఱును గలసి రామపాదముల యొద్దకు బైరాగిని చూడఁబోవుట.
' నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్క యున్నత గోత్రమున జననమొంది యూర్మికాకంకణాదులు మెఱుంగులు తుఱంగలింపఁ దన జననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జాఱుచు లేచుచుఁ గొంతకాలముండి యక్కడి నుండి మెల్ల మెల్లగా ముందు ముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధుర స్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆ పిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లి వేళ్ళను విడిచి తక్కిన వేళ్ళనంటుడు బాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి విదర్భాది దేశముల గుండఁ బ్రయాణములు చేసి, త్రోవపొడుగునను వచ్చి పుచ్చుకొనని వారిదే లోపముగా స్నానపానములకు వలయునంత నిర్మల జలం బొసంగి యాబాలవృద్ధ మందఱి నానందమొందించుచు, తా నడుగిడిన చోటులనెల్ల సస్యములకును ఫలవృక్షములకును, జీవనములిచ్చి వానిని ఫలప్రదములఁ గావించుచు తన చల్లఁదనము వ్యాపించినంత వఱకు నిరుపార్శ్వములందు భూమినంతను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబులు కాహారంబు కల్పించుచు, తన రాక విని దూరము నుండి బయలుదేఱి యడవి పండ్లును, నెమలికన్నులును వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, .....................