మనిషి అంతర్గత శాంతి కనుగొనక తప్పదు. మనిషి పుట్టిండే శాంత్యాత్మనీ, ఆ ఆనందాత్మనీ కనుగొనడానికే అని తెలిసేంతవరకూ, ఆ సుఖం కోసమనీ, ఈ సుఖం కోసమనీ వెతుకుతూనే వుంటాడు. ఆ పరమ ఆత్మ సుఖమే నిజమైన సుఖమని కనుగొనేంత వరకూ, మనిషికీ తిప్పలు తప్పవు.
అరుణాచల శ్రీరమణులు జీవించిన రోజుల్లో ఈ రచయిత మద్రాసులో నివసిస్తూ కూడా, శ్రీమతి సూరినాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు, రచయిత తండ్రి అయిన కీ.శే|| నీలంరాజు వేంకట శేషయ్యగారు తన 'నవోదయ' వారపత్రికలో, ప్రథమంగా ప్రచురించ నారంభించినప్పుడు, ఆఫ్రూఫ్ పేజీలన్నీ దిద్దుతూ వుండి కూడా, తిరువణామలైకు వెళ్లాలనే ఆలోచన కలుగలేదు.
కానీ అందుకై ఈ రయయిత చింతించడం లేదు. పరిణతిలేని ఆ పందొమ్మిదేళ్ల యౌవనంలో వెళ్లి మాత్రం ఏమి నేర్చుకుంటాడు? కానీ ఈనాడు ఆనాటి రమణ సంభాషణలను అనువదిస్తూ వుంటే, ఆ ఆశ్రమంలో తాను జీవిస్త్నుట్లు, నేర్చుకుంటున్నట్లు, అనుభూతి చెందుతుంటాడు.
ఆ 'స్పిరిట్ ' లోకి ప్రవేశించండి. శ్రీరమణుడి సమక్షంలో వున్నటువంటి అనుభూతి మీకూ కలుగుతుంది. శ్రీరమణులు, ఆయన జీవించిన కాలం కన్నా, మరింత కాలం జీవించాలని, ఎందుకనుకోవాలి? యాభై ఏళ్ల పైబడి ఆయన చేసిన బోధను విని నేర్చుకోలేని వారు (అందరి సంగతీకాదు) ఆయన మరో ఏభై ఏళ్లు జీవిస్తే నేర్చుకుంటారా? ఆయన మరణించే వేళలో ‘మీ సహాయం మాకింకా కావలసి వుంది. మీరు మరికొంత కాలం జీవించాలి. ఇప్పుడే వెళ్లిపోవద్దు' అని శ్రీరమణులను అర్థించినపుడు, 'వెళ్లిపోవడమా? ఎక్కడికి పోగలను? నేనెప్పటికీ ఇక్కడే వుంటాను' అన్నారు, అని వ్రాస్తాడు రమణ శిష్యుడైన మేజర్ చాడ విక్. అవును మరి బ్రహ్మ నిష్ఠుడి ప్రాణశక్తి ఎక్కడికి పోతుంది? ఎక్కడ తిరుగాడిందో, ఎక్కడ జీవించిందో, అక్కడ వుండనే వుంటుంది. అది ప్రవర్తిల్లుతున్న కారణం చేత, ఈ రచయిత ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది.