* బాలకాండం
శుద్ధబ్రహ్మ పరాత్పర రామ!
కాలాత్మక పరమేశ్వర రామ!
శేషతల్ప సుఖనిద్రిత రామ!
బ్రహ్మోద్యమర ప్రార్థిత రామ!
చండకిరణం కుల మండన రామ!
శ్రీమద్దశరథ నందన రామ!
కౌసల్యా సుఖవర్ధన రామ!
విశ్వామిత్ర ప్రియధన రామ!
మొదటి అధ్యాయం
వాల్మీకి మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. నిరంతరం వేదాధ్యయనం చేసుకొంటూ, శిష్యులకు వేద శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి నారద మహర్షిని చూసి, నమస్కారం చేసి తన సందేహాన్ని వెల్లడించాడు.
"మహర్షీ! గొప్ప పరాక్రమ వంతుడూ, ధర్మాలన్నీ తెలిసిన వాడూ, సత్యమే పలికేవాడూ, దృఢమైన సంకల్పం కలవాడూ, సదాచార సంపన్నుడూ, సర్వ భూతాలకూ హితం చేసేవాడూ, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? సర్వ శాస్త్రాలూ తెలిసినవాడూ, సర్వ కార్య నిర్వహణ సామర్ధ్యం కలవాడూ, తేజోవంతుడూ, కోపం లేనివాడూ, యుద్ధంలో ఎవరినైనా జయించగల వీరుడూ ఒక్కడైనా ఉన్నాడా? నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి" అని అడిగాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి, "అన్ని సద్గుణాలు ఉన్నవాడు ఇప్పుడు ఈ భూమి మీద రాముడు ఒక్కడే ఉన్నాడు" అని చెప్పి వాల్మీకి మహర్షికి రాముడి కథ అంతా సంగ్రహంగా చెప్పాడు.
వాల్మీకి నారదుడికి వీడ్కోలు చెప్పి, తాను స్నానానికి బయలుదేరాడు. వెంట శిష్యుడు భరద్వాజుడు మునికోసం పల్కలం తీసుకుని వచ్చాడు. తమసా నదీ తీరంలో బురద లేకుండా శుభ్రంగా ఉన్న రేవుకు వెళ్ళాడు..................