రఘురాముడు యుగపురుషుడు
త్రేతాయుగానికి ద్వాపరయుగానికి మధ్య సంధికాలం. సత్వగుణ ప్రధానమైన కృతయుగం ఎప్పుడో ముగిసిపోయింది. రజోగుణ ప్రధానమైన త్రేతాయుగం చివరిదశలో ఉంది. ధర్మం మూడు పాదాల మీద మాత్రమే నడుస్తోంది.
యుగలక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధర్మం ఎన్నోచోట్ల తల ఎత్తుతోంది. ఋజువర్తనులు తగ్గిపోయారు. సత్యవాక్పరిపాలకులు కరవవుతున్నారు. బలహీనుల్ని, ఆర్తనాదం చేసేవాళ్ళను ఆదుకొనేవాళ్ళు ఎవరు అని తర్కించవలసి వస్తోంది.
గంగాతీరంలో ఆశ్రమవాసి అయిన వాల్మీకి మహర్షి లోకంపోకడ గమనిస్తున్నాడు. భూమిమీద ధర్మసంస్థాపన చేసేవాళ్ళు అసలున్నారా అని ఆ మహానుభావునికి అనుమానం వచ్చింది.
ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి నారదమహర్షి వచ్చాడు. త్రేతాయుగంలో అప్పటికి స్వర్గలోకం నుండి దేవతలు, దేవ మునులు భూలోకానికి వచ్చిపోవడం జరుగుతూనే ఉంది.
తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవమ్
(శ్రీమద్రామాయణం : బాలకాండం : శ్లో : 1)
నారదమహర్షికి ఉచితమైన పూజలు చేసిన వాల్మీకి ప్రసంగవశాత్తు ఒక ప్రశ్నవేశాడు.
కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః
..........