అసిత్కుమార్ హాల్దార్
ఝాన్సీ స్టేషన్ నుండి లక్నో వెళ్లే బండి బయలుదేరింది. ఇంతవరకూ నీరసంగా కూచున్న ఒక బ్రిటిష్ సైనికోద్యోగి నావైపు చూచి, “ఎక్కడినుండి ఎక్కడకు?” అన్నాడు.
"దక్షిణాది నుండి లక్నోకు" అన్నాను.
. "జర్నలిస్టులా మీరు?" అన్నాడు.
"నా వృత్తి జర్నలిజం కాదు. కాని ఆరు సంవత్సరాల కొకసారి ఎప్పుడైనా గాలి తిరిగితే కొద్దో గొప్పో కలం ఆడిస్తా.”
"మరి, ఆర్టిస్టులా మీరు?” అన్నాడు నవ్వుకొంటూ.
"నేను ఆర్టిస్టును కాదు. కాని ఆర్టిస్టులకు మిత్రుడిని.” "మరి లక్నో పోయే పనేమిటి?" అన్నాడు మళ్లీ.
"మిత్రుడు ఆచార్య అసిత్కుమార్ హాల్దార్ను చూడబోతున్నాను," అన్నాను. * ఆ బ్రిటిషు సైనికోద్యోగి ముఖం ఏదో పరిచిత విషయాన్ని గ్రహించినట్లు ఆశ్చర్య సంభ్రమాలతో నిండింది.
“ఓ, ఆయన్ని నే నెరుగుదును. అద్భుతమైన నవ్య భారత చిత్రకారుడు. నేనీ దేశం రాకపూర్వమే హాల్దార్గారి చిత్రావళితో నాకు పరిచయం కలిగింది. నేను ఇంగ్లాండులో వుండగానే వీరి ప్రఖ్యాత 'ఉమర్ ఖయాం చిత్రావళి'ని ప్రథమంగా చుట్టం జరిగింది. మా దేశంలో హాల్దార్ గారి చిత్రకళకు మంచి............