క్రొత్త పైరు
చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్.)
కాకినాడ
ఒక్కో పరిచయం ఎలా మొదలౌతుందో తెలియదు. ఏదో యథాలాపంగా ప్రారంభమై, కాలంతోపాటు అలా కొనసాగుతుంది.
అదుగో... అలాగే దొండపాటి కృష్ణ ఓ రోజున మా ఇంటికొచ్చాడు. అతను అప్పుడు కాలేజీలో MCA చదువుకొంటున్న కుర్రాడు.
ఎవరు పంపించారని చెప్పాడో గుర్తులేదు కానీ, తనకు కవిత్వమూ కథలూ అంటే చాలా ఇష్టమనీ, తోచినవి ఏవేవో వ్రాస్తూంటానని చెప్పేడు.
ఒక పొడుగాటి తెల్ల కాగితాల పుస్తకం ఇచ్చి, అందులో తను వ్రాసినవి ఉ న్నాయనీ, చూడమనీ ఇచ్చి వెళ్ళేడు.
ఈ కాలం కుర్రాళ్ళలా సినిమాలూ, షికార్లూ అని పరిగెట్టకుండా ఇతనికి ఇదేం బుద్ది అనిపించింది.
సరే, అతను వ్రాసినవి చూశాను. ఏదో వ్రాయాలనే తపన అతనిలో
చూడగలిగాను.
మళ్ళీ వచ్చినప్పుడు అతనికి బాగా చదవమని సూచన చేశాను. కొన్ని పుస్తకాలు ఇచ్చాను కూడా. ఆ తరవాతే వ్రాయమని సలహా ఇచ్చాను.
ఎందుకంటే, 'Reading maketh a full man and writing an exact man' అని ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన మాట ఎవరికైనా శిరోధార్యం అని నా నమ్మకం.
కృష్ణ అలా చేశాడు.... సిన్సియర్ గా చేశాడు. తనలో దాగివున్న రచనాశక్తికి పదును పెట్టుకున్నాడు. నెమ్మదిగా కథలు వ్రాయడం మొదలుపెట్టి ఇప్పటికి ఓ యాభైకి పైగా వ్రాసి, తానూ ఒక వర్ధిష్ణు కథారచయితనని అనిపించుకుంటున్నాడు..........................