అంతర్జాతీయ ద్రవ్యనిధితో ముందస్తు ఏర్పాటు : 1981
భారతీయ రిజర్వు బాంకు డిప్యూటీ గవర్నరుగా నేను పదవీ స్వీకారం చేసింది 1982 ఫిబ్రవరిలో, అంతకు పూర్వం మూడు దశాబ్దాలు, దేశంలో గానీ, విదేశాలలో గానీ, విద్యాసంస్థలలో నేను అధ్యాపక వృత్తిలో ఉండేవాడిని. విధానరూపకల్పన రంగంలోకి నా • ప్రవేశం ఒక సవాలు, అవకాశం కూడా. అది ఒక అరుదైన నియామకం. విద్యాసంస్థలనుంచి నేరుగా డిప్యూటీ గవర్నరుగా నియమించబడినవారిలో నేను మొదటివాడిని.
భారత రిజర్వు బాంకులో చేరిన తరువాత నేను చేపట్టవలసివచ్చిన మొట్టమొదటి పని అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమ నిర్వహణ. అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఆ కార్యక్రమానికి సంబంధించిన షరతులు సంతృప్తి పరచటానికి వీలుగా తగిన చర్య తీసుకోవటం కోసం ప్రతివారం కలిసే బృందంలో నేను ఒక సభ్యుణ్ణి.
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఏర్పడుతున్న, నిరంతర ఆందోళనకు విదేశీ రంగం ఒక మూలం. ప్రత్యేకించి మొదటి మూడు దశాబ్దాలలో పరిస్థితి ఇదే. ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం చూపి, మొత్తం వ్యాపార చెల్లింపుల శేషాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే దిగుమతి ప్రత్యామ్నాయ విధానాన్ని భారతదేశం అనుసరించింది. వ్యాపార చెల్లింపుల సమస్యను అధిగమించటానికి 1955-56, 1980-81 మధ్య నాలుగు మార్లు భారతదేశం అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించవలసి వచ్చింది. 1966లో అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించాలని, రూపాయి మూల్యం తగ్గించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయింది. 1966లో రూపాయి మూల్యహీనీకరణ ఇంచుమించు తప్పనిసరి అయింది. అయితే వివిధ కారణాలవల్ల మూల్యహీనీకరణ ఫలితాలను మనం పూర్తిగా పొందలేదు. మొదటిది, 1966లో కరువు ఏర్పడింది. రెండవది, మనం ఆశించిన విధంగా మనకు వాగ్దానం చేయబడిన సహాయం అందలేదు. ఇదంతా చేదు. అనుభవం మిగిల్చింది. అయితే, 1981లో అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఆశ్రయించిన తీరు వేరు. ఆనాడు మన ముందు తీవ్రమైన సమస్య లేదు. అది స్వభావ రీత్యా ఎదురుచూస్తున్న సమస్య. అదే పెద్ద వ్యత్యాసం కలిగించింది.....................