ఈ పుస్తకం ఎందుకు చదవాలంటే...
ఋగ్వేదం ప్రపంచంలో తొలి సాహిత్య గ్రంథంగా ప్రపంచం గుర్తించింది. కావాలంటే అది ఒక కవితా సంకలనం అనవచ్చు. కథా సంకలనం అన్నా పద్యరూపంలో చెప్పిన కథల సంకలనం అన్నా తప్పులేదు. కథలూ, కవితలూ, వ్యాసాలూ కలిపిన పుస్తకాలను నేడు కదంబం అంటున్నాం. ఆ పద్ధతిలో కదంబంగా గుర్తించినా ఒప్పుకోవచ్చు.
సాహిత్య గ్రంథం అంటే ఏమిటి?
కథారూపం ఒక లక్షణం. అంటే కథనాత్మకం, వివరణాత్మకం. అంటే కాల్పనికం, కాల్పనికేతరం ఏదైనా కావచ్చు. భాషా, శైలి మరో గుర్తించబడిన లక్షణం. అందులో మానవానుభవం, ఊహలు, భావనలు ఉండటం వాటిమధ్య ఒక ఇతివృత్తం ఉండటం మరో కొలబద్ద. సాహిత్యం అన్న దాని నిర్వచనమే కాలక్రమేణా అనేక మార్పులకు లోనయింది. ఈనాడు సాహిత్యంగా భావించబడే రచనలకు ఈ లక్షణాలు సాధారణం. కాకపోతే లిఖిత చట్టాలూ, మతగ్రంథాలూ, తత్త్వశాస్త్రాలూ వంటి సమస్త గ్రంథాలూ మౌఖికం, లిఖితం అన్న భేదం లేకుండా ఆదిలో లిటరేచర్, వాజ్ఞ్మయం, సాహిత్యం, సారస్వతం వంటి పేర్లతో వ్యవహరించేవారు.
తొలి అనటంలో వాద ప్రతివాదాలు సహజం. తొలివాటిలో ఒకటి అని దాదాపు ప్రపంచమంతా ఋగ్వేదాన్ని గుర్తించింది. మట్టిపలకల మీద లభ్యమవుతున్న లిఖిత గ్రంథం గిల్గమేష్ ఐతిహ్యం (Epic of Gilgamesh) తొలిది అని కొందరు అంటారు. నాకు అనిపించేదంటంటే ఈ గ్రంథం తొలిదే కావచ్చు కాని వివిధ వ్యక్తుల సృజన గ్రంథంగా, దాదాపు వెయ్యి సంవత్సరాల సృజనా సంగ్రహంగా ఋగ్వేదం తప్పనిసరిగా తొలి అవుతుంది..............