కామ్రేడ్ రీటా
ఇదంతా నిన్నామొన్నా జరిగినట్లుంది నా జ్ఞాపకాల్లో.... ఆ రోజు రాత్రి మేమంతా కమాలానగర్లోని చిన్న ఆఫీసులో సమావేశమయ్యాం. ఇది ఢిల్లీ ఉత్తర ప్రాంతంలో బిర్లా కాటన్ టెక్స్టైల్ మిల్కు కూతవేటు దూరంలో ఉంది. నేను కాక అక్కడ మొత్తం పధ్నాలుగు మందిమి ఉన్నాం. అందరూ మిల్లు కార్మికులే. ఆ వారంలో కార్మికులు నడిమి షిప్ట్ పని చెయ్యాల్సి వచ్చింది. కాబట్టి ఆ షిఫ్ట్ రాత్రి తొమ్మిదిన్నరకి ముగుస్తుంది. అందుకే మేం రాత్రిపూట సమావేశం కావాల్సి వచ్చింది. వీధి గుమ్మం తలుపు గట్టిగా బిడాయించాం. గది మధ్యలో కిరోసిన్ లాంతరు రెపరెపలాడుతూ వెలుగుతుంది. ఆ గదిలో ఆట్టే కుర్చీలు పట్టవు. కాబట్టి మేమంతా గచ్చు మీద చతికిలబడి కూర్చున్నాం. బిర్లా మిల్స్ లోని పార్టీ శాఖతో అది నా తొలి సమావేశం. ఇలాంటి రోజు కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాను.
అది 1975వ సంవత్సరం ఆగస్టు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి అప్పటికి ఇంకా పట్టుమని రెండు నెలలు కాలేదు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కులను చెరబట్టారని సర్వే సర్వత్రా చెబుతుంటారు. అది నిజం కూడా. అంతకుమించిన నిజం ఏమిటంటే - ఆ ఎమర్జెన్సీ కాలంలోనే కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడులు జరిగాయి. కార్మికుల హక్కులకు పూచీగా నిలచిన అనేక నియంత్రణలు ధ్వంసం కావించబడ్డాయి. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందడానికి ఈ రెండూ పెను అడ్డంకులని పాలకశక్తులు భావించాయి.
భారత పెట్టుబడిదారులకు ఎమర్జెన్సీ వరప్రదాయినిగా మారింది. 70వ దశకం తొలినాళ్ళలో కార్మిక వర్గం చేపట్టిన సమరశీల పోరాటాలు దేశ పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వెన్నులో వణుకు పుట్టించాయి. 1974లో రైల్వే కార్మికులు నిర్వహించిన చారిత్రాత్మక సమ్మెకు దేశవ్యాప్తంగా సంఘీభావ పోరాటాలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీ కాలంలో కార్మికులకు యూనియన్ పెట్టుకునే ప్రాథమిక హక్కు నిరాకరించబడింది. కార్మికుల నిరసనలు, సమ్మెల మీద నిషేధం కొనసాగింది. అశేష త్యాగాలతో కార్మికులు సాధించుకున్న మౌలిక హక్కులను కాలరాసి పెట్టుబడిదారుల ఇష్టారాజ్యానికి వదిలేసారు. కార్మికులను 'క్రమశిక్షణ'లో పెట్టడానికి పెట్టుబడిదారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దేశంలో అగ్రగామి పారిశ్రామికవేత్తలలో ఒకరైన జె.ఆర్.డి.టాటా 'న్యూయార్క్ టైమ్స్' పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ "విషయం చాలా దూరం పోయింది. ఈ సమ్మెలు, నిరసన ప్రదర్శనలు, బాయికాట్స్ మూలంగా మేమెంత ఇబ్బందులు.........................