కొడవటిగంటి కుటుంబరావు శైలి
ఆర్వియార్ స్వీయ రచనలు
- ఆర్వియార్
శైలిని గురించి చెప్పడమంటే తేనె తుట్టను కదిలించినట్టే. ఒడుపుగా ఈగల్ని తప్పించుకుని తేనె చిక్కించుకోవాలి. ఇంత పెద్ద పనిని ఇంత చిన్న ప్రయత్నంలో సాధించాలని చూడడం సాహసమే. శైలి అన్న వెంటనే 'ఏ అర్థంలో వాడుతున్నావు?' అన్న ప్రశ్న వస్తుంది. దీనికి కారణం అనేక అర్థాలలో ఆ పదానికి ప్రాచుర్యముండటమే. పాశ్చాత్య సంస్కృతితో సంబంధం వచ్చేదాకా మనకు శైలి అనే అవగాహనే లేదు. శయ్య-రీతి-పాకము ఇలాంటి పండితభాష ఏదో వుండేది తప్పు, మామూలు మాటలతో మామూలు మనుషులకు రాసే వాళ్ళకు ఇంతటి ఉత్కృష్టమైనదేదీ వుండదని మనవాళ్ళ విశ్వాసం.
ఈ ఇరవయ్యవ శతాబ్దంలో మామూలు మనిషే మహనీయు
డయ్యాడు. ఆధునిక యుగంలో గతకాలపు విశ్వాసాలూ సిద్ధాంతాలూ అవగాహనలూ అన్నీ తల్లకిందులైపోయాయి. సమాజం అంటే ఒక కొత్త చారిత్రక ఆర్థిక అవగాహన, ఒక నూతన నైతిక బౌద్ధిక పునాదీ ఏర్పడ్డాయి. ఈ నూతన దృక్పథ ప్రతిఫలనమే ఈ నాటి మన కళలూ, మన సాహిత్యమూను. ఈ మార్పులకనుగుణంగానే అనేక విషయాలను గురించిన సైద్ధాంతిక అవగాహన కూడా మారింది. శైలిని గురించిన అవగాహనలో మార్పు కూడా ఈ పాశ్చాత్య సంస్కృతీ ప్రభావమే. మనకి గురజాడ అప్పా రావు పుట్టేదాకా నిజమైన వచనమే లేదు. అందుకని ఆధునికతకూ, ఆధునిక అవగాహనల కూ ఇప్పుడున్న అర్థం రాలేదు. మనకున్న జబ్బు యేమిటంటే అర్థం
కాకపోయినా అపోహలు పెంచుకోవ డం. తెలియని విషయాన్నైనా తెలిసిన దానికంటే ఎక్కువ చెప్పడం. ఈనాడు వచన గేయానికి జరుగుతున్న సైద్ధాంతికశుద్ధి ఈ దారిలోనే వుంది. అలాగే శైలిని గురించీ అనేక విపరీత అభిప్రాయాలు ఉన్నాయి. పాండిత్య ప్రదర్శనే శైలి అనే ఊహ చాలా మందికి బలంగా వుంది. అలంకార భూయిష్టమైన రచనే శైలి అని కొందరనుకుంటారు. కొంచెం కవిత్వ ప్రకోపం లేకపోతే, ఆ రచనకు 'శైలి'................