పాటల మాటలు
ప్రజాదరణ పాటకే ఎక్కువ.
"పాట" లయతో కూడుకొన్నది కావటంచేత హృదయాల్ని హత్తుకోవటంలో దాని స్పర్శ అలాగే ఉంటుంది. సంగీతం ఆపాతమధురం కదా! సాహిత్యం సరేసరి. అది ఆలోచనామృతం. రెండూ కలసి రెక్కవిప్పితే ఇక చెప్పాలా! రసోదయమే అది...
పాటకు వయస్సు ఇంత అని చెప్పలేం.
జానపదం ఎప్పుడు పదం మోపిందో వివరించలేం. అది అప్రయత్నంగా
గొంతులోంచి ఏదో నడకలో ఏదో భావంలో పాండిత్యంతో పని లేకుండా ఎప్పుడో వేటకు సంబంధించి ఆటవికనేపథ్యంలో ప్రకృతిని పలుకరించి ఉంటుంది. లిపిలేని రోజుల్లోనే పాట పల్లవించింది. అది అలా అలా ఒకోచరణాన్ని అభ్యుదయ దిశగా మోపుతూ ఈనాడు ఏకంగా సింహాసనంపైనే కూర్చుంది.
పాటకు పరవశించనివారెవరుంటారు? పశుపక్ష్యాదులు సైతం స్పందించవలసిందే!
పద్యాల్ని వ్రాస్తున్నప్పుడే - ఎందుకో "యేటిగట్టున యేటి యెకసక్కెములు మావ..." అంటూ పాటవైపు నా దృష్టి మళ్లింది. ఆ పాటను ఈ పుస్తకంలో మీరు గమనిస్తారు. అరవైయేళ్ల క్రితం మొగ్గతొడిగిన పాట అది.
ముందుగా నన్ను పలుకరించింది మాత్రం పద్యం 1953ఐదవతరగతి చదువుతున్నపుడు.
అప్పటికే నాన్నగారిదగ్గర శతకసాహిత్యాన్ని క్షుణ్ణంగా మనస్సుకి పట్టించుకొన్నాను. సంస్కృతబాలరామాయణం వంటివి చదువుకొన్నాను........................