మనవి
1911 సెప్టెంబర్ 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురులో జన్మించిన డా॥బోయి భీమన్న తన జీవితంలో తాను పేదరికాన్ని, అంటరానితనాన్ని, కష్టాలు, బాధలు అనుభవించినా నిరంతరం నిత్య సంతోషంతో జీవిస్తూ వాటిని తమ రచనలలో ప్రతిఫలింపజేశారు. నాటకంలో చిత్రించే సమస్య ఏదైనా అది రచయిత జీవన పరిధి మీద ఆధారపడి ఉంటుందనే విషయం సత్యదూరం కాదు. ఎందుకంటే సమకాలీన సమాజంలో ప్రగతిని దర్శించాలనుకునే రచయిత దృష్టి ఎప్పుడూ సంఘంలో ఉన్న సమస్యల మీద కేంద్రీకృతం చేస్తారు. ఆయా సమస్యలకు స్పందిచడం, ఆ ఆవేదనకు అక్షరరూపం ఇవ్వడం ద్వారా సంఘ సమస్యలను స్పృశిస్తూ తమ రచనలకు పరిపుష్ఠం చేస్తారు. ఈ పరిధిలో నుంచే డా॥ బోయి భీమన్న గారి దృక్పధాన్ని కొన్ని అంశాలు ద్వారా విశదీకరించవచ్చు. 1. సంఘంలో వివిధ రూపాలలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపడం 2. కుల నిర్మూలనకు ప్రాధాన్యతనిస్తూ మహాత్మాగాంధీ, అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడై 'అస్పృశ్యత'ను తన కలం ద్వారా రూపుమాపాలనుకున్న మేధావి బోయి భీమన్న. మారుమూల గ్రామానికి చెందిన బోయి భీమన్న భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్నారు.
భీమన్న తన చిన్నతనం నుండే పేదరికం, కుల వివక్ష అలాగే అనేక రకాల అవమానాలను అనుభవించడం వల్ల సహజంగానే వాటిని నిరసించాడు. ఇందుకు ఒక ఉదాహరణ 1945 సంవత్సరంలో అక్టోబర్లో ఒక రోజు, శ్రీ పిఠాపురం మహారాజావారి షష్టిపూర్తి మహోత్సవం జరుగుతోంది. రాజుగారి కోటలో కవి పండిత సన్మానంతో ఆ మూత్సవం ప్రారంభమవుతుంది. ఈ సభకు బోయి భీమన్న గారు కవి, రాజకీయవేత్త, భీమన్న గారికి బంధువు అయిన బయ్యా సూర్యనారాయణమూర్తి గారితో వెళ్లారు. ఈ సభలో మహాపండితులు, కవులు, రాజకీయవేత్తలు, విజ్ఞాన సముద్రులు, మహారాజులు, జమీందార్లు అనేకమంది ఆసీనులై ఉన్నారు. మూర్తి గారి సలహా మీద, బులుసు సాంబమూర్తి గారి ప్రోద్బలంతో, బోయి భీమన్న గారిని కవిగా సన్మానించడానికి సన్మాన సంఘం వారు పిఠాపురం పిలిపించారు. కాని దళితుడైన కారణంగా బోయి భీమన్న గారి పేరును కవుల జాబితాలో చేర్చలేదు. అప్పుడు బోయి భీమన్న గారు సన్మానం అక్కర్లేదు. ఆ మహాసభలో నిలబడి, పద్యాలు చదివే అదృష్టం అయినా కలిగితే బాగుంటుందని భావించి పద్యాలు చదివే వారి లిస్టులో అడుగున తన పేరు చేర్చాడు. ఇది సన్మాన సంఘ నాయకులకెవరికీ తెలియదు. నలుగురు అయిదుగురు కవులు పద్యాలు చదివిన తరువాత ఆఖరున బోయి...........................