సంపాదకీయం
తెలుగు సాహిత్యంలో ఒక 'ప్రామిసింగ్' రైటర్ డా॥ వి.ఆర్. రాసాని. వర్తమాన కథా సాహిత్యంలోను, నవలా సాహిత్యంలోను తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఒక విశిష్ట రచయిత, ప్రసిద్ధ కథకులు మధురాంతకం రాజారాం చెప్పినట్లు "ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని పల్లెటూళ్ళ పామర ప్రజల్ని గురించి రచనలు చేసిన వారి సంఖ్య తక్కువ. ఈ కొద్దిమంది జాబితాలో తప్పక చేర్చవలసిన పేరు వి.ఆర్. రాసాని".
రాసాని ఎక్కువగా పల్లెల్లోని ఆర్థిక వ్యత్యాసాలతోను, సామాజిక నిమ్నోన్నతాలతోను సతమత మవుతున్న జనాల గురించీ, పల్లెల్లో కులాల పేరుతో జరిగే దోపిడీ, అణచివేతల గురించీ అభ్యుదయ దృక్పథంతో రచనలు చేస్తున్న వ్యక్తి. కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడిగా, కాలమిస్టుగా, రంగస్థల నటుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనబరుస్తున్న రచయిత. ప్రాచీన సాహిత్యంలోనైనా సరే అభ్యుదయాంశమున్న ఘట్టాన్ని, చారిత్రకాంశాన్ని సైతం వదలకుండా అక్షరబద్ధం చేసి మెప్పించినవాడు. రాసాని శ్రామిక జన పక్షపాతి. అందుకే అణగారిన కులాల వాళ్ళ గురించీ, గిరిజనుల గురించి, కులవృత్తుల కులాల వారిగురించి రచనలు చేశాడు. ఉత్పత్తులు (products) లేకుంటే సమాజానికి ఆహారంతోబాటు వస్తు సామగ్రిలేదు. నేటి నాగరికతే లేదు. అలాంటి ఉత్పత్తుల సృష్టికర్తలైన కష్టజీవులు, రైతుల గురించి ఎంతో ఆర్ద్రతతో రచనలు చేసినవాడు. పైగా ఏది రాసినా ఒక సాంస్కృతిక నేపథ్యం, ఒక తాత్వికత పడుగూ పేకలా ఆతని రచనలో కలిసిపోయి వుంటాయి. ప్రతి జాతికీ ఒక సంస్కృతి వుంటుందనీ, ఏ పాత్ర సృష్టించినా ఆ పాత్ర యొక్క సామాజిక (social), సాంస్కృతిక (cultural), ఆర్థిక (financial) విషయాలు తప్పక ఆ పాత్రపైన ప్రభావం చూపిస్తాయని నమ్ముతాడు. అందుకే కొందరు రాసానిని 'విశిష్ట సాంస్కృతిక 'రచయిత'గా పేర్కొన్నారు.
రాసాని యిప్పటివరకూ వందకు పైగా కథలు, 8 నవలలు, 9 నాటకాలు, కొన్ని వందల కవితలు, వ్యాసాలు ప్రచురించారు.
బాల్యం, విద్యాభ్యాసం : చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలంలోని ఒక చిన్న గ్రామంలో పశుపోషణ, వ్యవసాయం వృత్తిగా గల కుటుంబంలో పుట్టాడు. తల్లి రాసాని యల్లమ్మ, తండ్రి రాసాని శిద్ధయ్య, నలుగురి అన్నదమ్ముల్లో మూడోవాడు. ఇద్దరు అక్కచెల్లెళు ఎ. కమ్మపల్లెలో ప్రాథమిక స్థాయి, పులిచెర్ల హైస్కూల్లో ఉన్నతస్థాయి విద్య అభ్యసించి, ఇంటర్ పీలేర్లోను, బి.ఏ., ఎం.ఏ., ఎం.ఫిల్, పిహెచ్.డి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలోను, ఎస్వీయూనివర్శిటీలోను పూర్తి చేశారు................................