కవి చిత్రకారులైన రచయితల్లో శీలా వీర్రాజు వ్యక్తిత్వం విశిష్టం. ఆయన కృతిత్వం ప్రత్యేకతను సంతరించుకుంది. 60 సంవత్సరాల క్రితం బహుశ 1961-62 మధ్య కాబోలు, నేను మిత్రులు మానేపల్లి హృషీకేశవరావు (నగ్నముని) వెంట వెళ్లి, ఎర్రగడ్డలో ఉన్న టి.బి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శీలావీని చూసాను. రాజమండ్రి నుండి వచ్చిన కవి - కథకుడు- చిత్రకారుడిగా ఆయన పరిచయం. ఇక ఆ పరిచయం ఒక సాహిత్యానుబంధంగా బలపడింది. ఆ ఆరు దశాబ్దాలలో ఆయన మారిన అద్దె ఇళ్లు, ఆ తర్వాత సొంత ఇల్లూ నేను ఎప్పుడు వెళ్లినా వీర్రాజుగారితో పాటు శ్రీమతి శీలా సుభద్రాదేవి స్నేహం-ఆతిథ్యం లభించాయి.-
ఆయన 'కృష్ణా పత్రిక' (వీక్లీ) ఉపసంపాదకుడిగా ఉన్న కాలంలో (1960-64) మొజంజాహీ పళ్లమార్కెట్ (మెయిన్ రోడ్) దుకాణాల మధ్య ఉన్న పత్రికా ఆఫీసుకు వెళ్లి కలిసేవాణ్ణి. అక్కడ ఆ అంగడి దుకాణం ప్రవేశ ద్వారం దగ్గర కూచుని శీలావీ ఎడిటింగ్ చేసేవారు - సంపాదక యజమాని సుబ్రహ్మణ్యం లోపల కూచునేవారు. కె. యాదవరెడ్డిగా నేను రచనలు చేస్తున్న కాలమది. శీలావీ ఎంతో సౌజన్యంతో సూచనలు చేస్తూ, 'కృష్ణా పత్రిక' లో నా కవితలు, కథ, విమర్శనా వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు.
ఆ తర్వాత కుందుర్తి ఆంజనేయులు గారి మార్గదర్శకత్వంలో మేమంతా వచన కవితా ప్రక్రియలో ప్రయోగాలు చేస్తున్న సమయాన శీలావీతో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కాలక్రమంలో ఆయన నిర్వహణలో 'ఫ్రీవెర్స్ ఫ్రంట్' కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి - వాటిలో నా భాగస్వామ్యం కూడా కొంత ఉన్నది................