'కాకతాళీయం అంటూ ఏమీ లేదు. కొన్ని సంఘటనల వెనుక ఉండే సంబంధాల సూత్రాలు మనకు కనిపించవు. అంతే'
నేనే గిలికిన ఈ పంక్తులు పాత పుస్తకంలోని చివరి పేజీలో నా కంట పడ్డాయి. కిందటి రోజు వచ్చిన కార్పెంటర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ వెతకడానికి బెడ్రూమ్లో దూరిన నాకు అది తప్ప మిగిలినవన్నీ చేతికి దొరుకుతున్నాయి. ఒక విధంగా చూస్తే కెలకటాన్ని వెతకటం అనేలా లేదు. నీట్గా మడిచిపెట్టిన న్యూస్ పేపర్ దొరికితే దాన్ని ఎందుకు జాగ్రత్త చేశానో తెలియక బుర్రపాడుచేసుకుని పేపరంతటా చూపులు సారించేవాడిని. ఏదో ట్రైనింగ్ క్యాంపు గ్రూప్ ఫోటో కనిపిస్తే అప్పటి నాకూ ఇప్పటి నాకూ ఉన్న వ్యత్యాసాన్ని గమనించేవాడిని. తర్వాత చూడొచ్చని పక్కన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఫారమ్లు గమనించి, చేజారిన అవకాశాల నష్టాన్ని అంచనా వేసేవాడిని. ఇలాగే కాలక్రమంలో పేరుకుపోయిన వాటిని అనవసరంగా వేరు చేస్తుంటే వెతకబోయింది దొరికే అవకాశం కనిపించలేదు. ఇది మొదటిసారి కాదు. దేన్ని వెతకబోయినా ఇదే నా కథ. ఈరోజు కూడా ఇలాగే దారి తప్పి మైమరచినప్పుడు, పాత పుస్తకంలోని ఈ వాక్యాలు నన్ను పట్టుకుని ఆపాయి. చాలా వెనుకటి ఒక కాలంలో, మనసుకు తట్టిన లేదా చదివి గమనించిన ఇలాంటి ముత్యాల్లాంటి మాటలను ఎక్కడంటే అక్కడ రాసిపెట్టే అలవాటు ఉండేది. కాగితం ముక్కలోనో, పుస్తకంలోని చిట్ట చివరి ఖాళీ పేజీలోనో....................