సాక్షాత్కారం
“నాకు నీ అక్షరాలంటే ఇష్టం. ఆ అక్షరాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోతూ వెలువరించే భావాలంటే ఇష్టం. ఆ భావాలలోని సున్నితత్వం, లాలిత్యం ఇంకా ఇష్టం. మరీ ముఖ్యంగా నీ ముగింపు మాటలు చాలాచాలా ఇష్టం. ఎందుకంటే.., ఆ చివరి పదాలు తమ అనుభూతి సాంద్రతతో అంతవరకూ చదివిన పంక్తులు కలిగించిన భావాలన్నిటినీ ఒకానొక కొత్తకోణంలో ఆవిష్కరిస్తాయి. అదే నీ కావ్యాత్మ... అదే పఠితల్లో నువ్వు కలిగించే నవజీవన సాక్షాత్కారం. అదంటే నాకు చెప్పలేనంత ఇష్టం"
ప్రతీక తన కవిత్వాన్ని అంతగా పొగిడేస్తుంటే ప్రణీత్కి ఏం మాట్లాడాలో తోచలేదు. పెదాలకీ పదాలకీ లంకె కుదరనప్పుడు మాట్లాడగలిగింది కేవలం మౌనం మాత్రమే. అందుకే నిశ్శబ్దంగా ఆమె కళ్ళలోకే చూస్తూండిపోయాడు. ప్రతీకంత అందంగా కళ్ళతో సంభాషించడం ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ రాదు. అందుకే, ఆ కనుల్లోని మెరుపుని చూస్తూ ఆమె ముఖంలోని ఆకర్షణని ఆస్వాదించడం అతనికి చాలా ఇష్టం. తన కవితల్లో పఠితలకు కలిగే సాక్షాత్కారం మాటేమోగానీ ఆ కవితల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ప్రతీక కన్నుల్లో కనిపించే వెలుగులు తనకి చాలాచాలా ఇష్టం. తనా మాట అనగానే ఆమె చూపుల్లో సిగ్గులు మొగ్గలు తొడుగుతాయి. ఆ మొగ్గలు బుగ్గల్ని నిగ్గు తేలుస్తాయి. ఆ నున్నని బుగ్గలని నిమురుతూండటం అతనిని కలల లోకాల్లో విహరింపజేస్తుంది.
అతనెంతసేపటికీ పెదవి మెదపకుండా తదేకంగా తననే చూస్తూ ఉండిపోవడంతో ప్రతీకే చొరవ తీసుకుని అతని ఏకాగ్రతని భంగం చేసింది. "ఏం కవిగారూ, నా ఫేసేం మీకు కొత్తా? అలా చూస్తున్నారు?" "నేను చూస్తున్నది నీ ముఖాన్ని కాదు”
"మరి దేన్ని?”
“చెప్పలేను”
"నా మొహంలో అంత చెప్పలేనివేం కనిపిస్తాయి? నీ మొహం"........................