వేమనను ఇంకా ఎందుకు చదవాలి ?
రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
“పరుల బాధలేక బ్రతుకుడి నరులార!"
వేమన క్రీ.శ.17వ శతాబ్దం నాటి కవి. మనకన్నా 350ఏళ్ళ ముందు జీవించిన కవి. భారతదేశ చరిత్రలో మధ్యయుగం చివరిదశలో జీవించిన కవి. వలసపాలనకు భారతదేశంలో పూర్వరంగం రూపుదిద్దుకుంటున్నకాలంలో జీవించిన కవి. మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. ఆయనను మనం ఇంకా ఎందుకు చదవాలి? ఆయనకూ మనకాలానికీ, మన జీవితానికీ ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ప్రజలు గానీ, ప్రభుత్వం గానీ వేమన జయంతిని నిర్వహించడం అర్థంలేని పని అవుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేమన జయంతిని అధికారికంగా జరుపుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలి. వేమన జీవితకాలం గురించి పరిశీలకులలో ఏకాభిప్రాయం లేదు. అయితే వేమన 17వ శతాబ్దంలో జీవించాడని చాలామంది ఆయన కవిత్వం ఆధారంగా నిరూపించారు. వేమన విజ్ఞాన కేంద్రం ఆ కాలాన్నే పరిగణిస్తున్నది.
ఒక్కవాక్యంలో చెప్పాలంటే వేమన తన పద్యాలలో ఏయే సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, తాత్వికాంశాలను విమర్శకు పెట్టాడో అవి ఈ ఆధునిక కాలంలో, కొంతమంది దృష్టిలో అత్యాధునిక కాలంలో కూడా కొనసాగుతున్నాయి. అంటే మనం ఆధునిక కాలంలోకి ప్రవేశించాంగానీ, పూర్తిగా ఆధునికులం కాలేదు. సగంపాత, సగం కొత్త మధ్యలో ఇరుక్కొని ఉన్నాం. మనలో ఇంకా మిగిలిపోయి ఉన్న పాత వేమన కాలం నాటిది. దానిని ఆయన వర్తమాన దృక్పథంతో విమర్శించాడు. మనలోని ఆ పాతను వదులుకోవాలంటే వేమనను చదవాలి. మనం సంపూర్ణ ఆధునికులు కావాలంటే వేమనను ఆశ్రయించాలి. అందుకే వేమనను మనం ఇంకా చదవాలి. అయితే మనం ఏమీ సాధించలేదా? అంటే చాలా సాధించాం. వేమనకు కారు, బస్సు, రైలు, విమానం, టెలిఫోన్లు, కంప్యూటరు, సెల్ ఫోను, ఇంటర్నెట్టు, వాట్సాప్, ట్విట్టర్ వంటివి తెలియవు. అవి మనకు తెలుసు. ఈ నిజాన్ని గర్వంగా చాటుకుంటూనే మనం చాలా విషయాల్లో...............