కరదీపిక
డా. దీవి నరసింహదీక్షిత్ సంస్కృత విభాగాధిపతి, హిందూకళాశాల, గుంటూరు.
"ఏకః శబ్దః సుప్రయుక్తః సమ్యకతః స్వర్గే లోకే కామధుగ్భవతి" చక్కగా ప్రయోగింపబడి బాగుగా తెలుసుకోబడిన శబ్దమొక్కటి ఈ లోకంలో స్వర్గలోకంలోనూ కామధేనువు ఔతుందని మహాభాష్యకారుని వచనం. అర్థమెరిగి చేసిన పదప్రయోగం ఎంతో ప్రయోజనకారి అని దాని తాత్పర్యం. అనంతమైన పద సంపదను కలిగిన భాష సంస్కృతం. ఈ భాషలోని పదాల్ని అర్థ జ్ఞానంతో నేర్చుకోవడానికి నిఘంటువులు నిర్మించి అమరసింహుడు మొదలైన విద్యన్మణులు మహోపకారం చేశారు. ఆధునిక కాలంలో శబ్దకల్ప ద్రుమః, వాచస్పత్యమ్ వంటి సంస్కృత నిఘంటువులు భాషా దాహార్తిని తీర్చగలుగు తున్నాయి.
సంస్కృతం-తెలుగు నిఘంటువులు వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. అవికూడ అందుబాటులో లేవు. ఇట్టి తరుణంలో శ్రీ భాగవతులు రాధాకృష్ణమూర్తి గారు సంకలన పరచిన ఈ నిఘంటువు - సంస్కృతభాషా మహారణ్యం వైపు అడుగులు వేసే ఆంధ్ర పాఠకులకు చేతిలోని దివిటీ కరదీపిక.
విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని సుమారు 6,000 పదాల్ని ప్రణాళికాబద్ధంగా పొందుపరచి నిఘంటు రూపంలో అందించిన శ్రీ రాధాకృష్ణమూర్తి గారు బహుధా ప్రశంసార్హులు. సంస్కృత పదాలకు తెలుగు ఉచ్చారణ కూడ ఇవ్వటం ఇందులోని ప్రత్యేకత. ఈ ప్రయత్నం సమగ్ర సంస్కృత నిఘంటువుల నిర్మాణానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.....................