కొండా
పూడూరి రాజీరెడ్డి
ముందు బయటికి పోదామనే అనుకున్నాడు లింగయ్య. దేనికో తెలియని వ్యతిరేకతతో కైకిలి పద్దులేవో గిలుక్కుంటూ పెద్దపీట మీద కూర్చున్నాడు. అరుగంచుకు గంపకింద కమ్మివున్న కోడి నిశ్శబ్దంగా ఆయన ఏకాగ్రతను చెదరగొడుతూనే ఉంది. గంప పక్కనే ఉన్న చిన్న అడ్డగుల్లలో కొన్ని బొగ్గులు పోసి, మూణ్నాలుగు కొడవళ్లు పెట్టి ఉన్నాయి.
ఏటవాలుగా కదిలిన నీడ వల్ల ఎవరో వస్తున్నట్టు అనిపించి తలెత్తాడు లింగయ్య. ఆ నీడతో పాటే వచ్చిన మాట ఎవరిదో తెలిసి, అలవాటైన పట్టనితనంతో మళ్లీ చేతివేళ్లు లెక్కపెట్టుకోసాగాడు.
“చిన్న పటేలుకు ఇంకా పొద్దు వొడిశినట్టు లేదు.”
పరాచికాన్ని చెంపల్లో దాచుకుంటూ వస్తున్న ఆ మనిషి అడుగులు దగ్గరవుతూనే గంప కింది కోడి రెక్కలు కొట్టుకుంది. చిన్న వాకిట్లోకి వస్తూనే అలవాటుగా 'చాకలోన్నవ్వా' అనవలసినవాడిని ఆ రెక్కల చప్పుడు కొద్దిసేపు ఆపింది. మాట కలపడానికి ఆ చప్పుడు ఒక సాకుగా ఉన్నప్పటికీ లింగయ్య ముఖంలో కనబడని ప్రసన్నత నోరు తెరవనీయలేదు. లోపలికి కేకేసి, బదులివ్వాల్సిన ఇంటావిడ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు............